Share News

అమాయకులపై సైబర్‌ వల

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:02 AM

పోలీస్‌ కమిషనరేట్‌లో ఏడాది కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు విలవిలలాడిపోయారు.

అమాయకులపై సైబర్‌ వల

- ‘దడ’ పుట్టించిన భూకబ్జా కేసులు, అరెస్టులు

- 23 మందిపై కొత్తగా రౌడీషీట్లు...

- ఆగని రోడ్డు ప్రమాదాలు

- తగ్గిన హత్యలు, దోపిడీలు, చెయిన్‌స్నాచింగ్‌లు

- ఏడాదిలో 18,623 కేసులు నమోదు

- డయల్‌ 100కు 46,191 ఫిర్యాదులు

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమిషనరేట్‌లో ఏడాది కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు విలవిలలాడిపోయారు. సైబర్‌ నేరాలతోపాటు భూకబ్జాలు, చిట్‌ఫండ్స్‌ మోసాలు, జాబ్‌ ఫ్రాడ్‌ వంటి ఆర్థికపరమైన నేరాలు పెరిగాయి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో సైబర్‌ నేరగాళ్లు వలకు చిక్కుకున్నారు. భూకబ్జాలకు సంబంధించిన బాధితులు వేల సంఖ్యలో ఉండడాన్ని గ్రహించిన సీపీ అభిషేక్‌ మొహంతి ప్రత్యేకంగా ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) ఏర్పాటు చేసి భూకబ్జాలకు పాల్పడిన రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను కటకటాల్లోకి పంపించారు. భూకబ్జాదారుల్లో దడను పుట్టించారు. గంజాయి అమ్మకాలు, రవాణా పెరిగింది. కమిషనరేట్‌ వ్యాప్తంగా గంజాయి రక్కసి జెడలు విప్పింది. పట్టణాలతోపాటు, గ్రామాల్లో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన 23 మందిపై కమిషనరేట్‌ పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. గత ఏడాదికంటే రోడ్డు ప్రమాదాలు కొంతమేరకు తగ్గినప్పటికీ ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఏడాది కాలంలో హత్యలు, దోపిడి, చెయిన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. కమిషనరేట్‌ వ్యాప్తంగా 18,625 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 14,296 ఫిర్యాదులు రాగా, ఈ ఏడాది 4,329 ఫిర్యాదులు పెరిగాయి.

- 2024లో కమిషనరేట్‌ వ్యాప్తంగా 18,625 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఫైనాన్స్‌ సంబందించినవి 23 శాతం, శారీరక నేరాలు 11, రోడ్డు ప్రమాదాలు ఐదు, ఇతరాలు 61 శాతం ఉన్నాయి.

- ఈ యేడు 3,121 ఫిర్యాదులు అందాయి. ఇందులో భూమికి సంబందించినవి 57 శాతం కాగా, కుటుంబానికి సంబంధించినవి ఏడు, మోసాలవి 16 , ఇతరలు 20 శాతం ఉన్నాయి.

- కమీషనరేట్‌ వ్యాప్తంగా 7,027(ఎఫ్‌ఐఆర్‌) కేసులు నమోదు కాగా 5,180 కేసుల్లో విచారణ పూర్తి అరుంది.

- ఈ సంవత్సరం ఆర్థిక నేరాలకు సంబంధించి 726 కేసులు నమోదు కాగా, ఇందులో సైబర్‌ నేరాలు 46 శాతం, భూమికి సంబంధించిన నేరాలు 15 శాతం, నగదుకు సంబంధించి 8 శాతం, చిట్‌ఫండ్స్‌కు సంబంధించి 7 శాతాం, జాబ్‌ ఫ్రాడ్‌ సంబంధించి 5 శాతం ఉన్నాయి.

- కమిషనరేట్‌ వ్యాప్తంగా అల్లర్లకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలీస్తే కొంతమేర తగ్గాయి. రాబరీ, డెకాయిటి (దోపిడి) కేసులు 38 శాతం తగ్గాయి. ఈసారి ఐదు కేసులు నమోదయ్యాయి. 14 కేసులు హత్య కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పొలిస్తే హత్యకేసులు 33 శాతం తగ్గాయి. ఏడు చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి,

- కమిషనరేట్‌ వ్యాప్తంగా 184 ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయి.

ఫ సైబర్‌ నేరాల ఫిర్యాదులు...

సైబర్‌ నేరాలకు సబంధించి 2,282 ఫిర్యాదులు అందాయి. 270 కేసులు నమోదయ్యాయి. 233 కేసుల్లో బాధితులు కోల్పోయిన 9.87కోట్ల రూపాయలు పుట్‌ ఆన్‌ హోల్డ్‌లో ఉంచగలిగారు. 2024 సంవత్సరానికి గాను 2.57 కోట్ల రూపాయలు బాధితులకు అప్పగించేందుకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందారు.

ఫ భూమి సంబంధిత కేసులు...

కమిషనరేట్‌ వ్యాప్తంగా భూతగాదాలకు సంబందించి, నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేసిన ఘటనల్లో 113 కేసులు నమోదయ్యాయి. 179 మంది అరెస్ట్‌ అయ్యారు. ఇందులో 60 కేసులు నకిలీ సరిహద్దులు సృష్టించినందుకు నమోదు అయ్యాయి.చిట్‌ ఫండ్‌ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదై 9 మంది చిట్‌ఫండ్‌ డైరక్టర్లతో సహా 16 మందిని అరెస్ట్‌ చేశారు. జాబ్‌ ఫ్రాడ్‌ మోసాలకు సంబంధించి 33 కేసులు నమోదై, 27 మందిని అరెస్ట్‌ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసినందుకు గాను 610 కేసులు నమోదై 1,198 మంది అరెస్ట్‌ చేసి, 797 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

- గంజాయికి సంబంధించి 39 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్టు చేసి 128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 91మందిపై జూదం కేసులు నమోదు చేసి 593మందిని అరెస్టు చేశారు.

ఫ పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పోలీసులు 99 కేసులు నమోదు చేసి 189మందిని అరెస్టు చేశారు. 96వాహనాలను స్వాదీనం చేసుకుని 4,289 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. - అక్రమ మద్యానికి సబంధించి 360 కేసులు నమోదు చేసి 4,257 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- కమిషనరేట్‌ వ్యాప్తంగా 6005 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి 147 మందిని జైలుకు పంపించారు. నంబర్‌ ప్లేట్స్‌ లేని 1,281 వాహనాలను పట్టుకున్నారు. 195 మంది మైనర్లు వాహవానలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఫ వివిధ విద్యాసంస్థల్లో 56 యాంటీ డ్రగ్స్‌ సమావేశాలు నిర్వహించి 158 యాండీ డ్రగ్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ యేడాది పలు నేరాల్లో నిందితులుగా ఉన్న 23 మందిపై రౌడీషీట్లు తెరిచారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 23 మంది ప్రాణాలను వివిధ సందర్బాల్లో పోలీసులు కాపాడారు. రెండు ఘటనల్లో బాదితులు పోగోట్టుకున్న 20తులాల బంగారు ఆభరణాలను గుర్తించి అప్పగించారు. ఐదు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడింది. కరీంనగర్‌ శివారులో భరోసా కేంద్రాన్ని డీజీపీ జితేందర్‌ కొత్తగా ప్రారంభించారు.

ఫ ముఖ్యమైన నేర ఘటనలు

- మార్చి 15న అర్ధరాత్రి ప్రతిమ మల్టిప్లెక్స్‌లో 6.67 కోట్ల నగదు పట్టుకుని ఐటీ అధికారులకు అప్పగించారు.

- మార్చి30న బొమ్మకల్‌లో విష గుళికలు మింగి తల్లి, కూతురు, మనువరాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

- ఏప్రిల్‌ 21న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జైలులో ఉన్న అడిషనల్‌ డీసీపీ రాధకిషన్‌ రావును కరీంనగర్‌లో ఉన్న తల్లిని కలిసేందుకు తీసుకువచ్చారు.

- మే25న చింతకుంటలో ఒడిస్సాకు చెందిన ఇటుక బట్టీ కార్మికురాలు బేని బిందాని (36) ఆమె కూతురు బాబి బిందాని(18) విద్యుదాఘాతంతో మృతి చెందారు.

- మే29న కరీంనగర్‌ జ్యోతినగర్‌లో బైక్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.

- జూన్‌24 ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని ప్రేమజంట ఉజ్వల పార్కు వద్ద క్రిమి సంహారక మందు తాగగా యువకుడు మృతి చెందాడు.

- జూలై4న కరీంనగర్‌ డీసీయంఎస్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌ రావు, క్యాషియర్‌ కుమారస్వామిలు లక్ష రూపాయల లంచం తీసుకుంఉండగా ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

- జూలై11న ముంబైకి చెందిన సైబర్‌ క్రైం పోలీసులు కరీంనగర్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఒక్కరిని అరెస్టు చేసి ముంబాయికి తరలించారు.

- జూలై12న మావోయిస్టు అమిత్‌ బాగ్చిని 2008 కేసుకు సంబందించి జార్ఖండ్‌లోని రాంచీ జైలు నుంచి కరీంనగర్‌ కోర్టులో హజరు పరిచారు.

- అక్టోబరు 30న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్‌ రాగా కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

- నవంబరు 4న రెండున్నర సంవత్సరాల బాలుడిని కిడ్నాప్‌ చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

- నవంబరు 26న చింతకుంటలో ఆనారోగ్యంతో ఉన్న వృద్ద దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఫ విజిబుల్‌ పోలీసింగ్‌ పై దృష్టి సారిస్తాం...

- అభిషేక్‌ మొహంతి, సీపీ

నూతన సంవత్సరంలో విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం పెంచుతామని పోలీస్‌కమిషనర్‌ అభిషేక్‌ మొహంతి తెలిపారు. కరీంనగర్‌ పోలీస్‌కమిషనరేట్‌ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్‌లో సోమవారం 2024 కమిషనరేట్‌ వార్షిక నివేదిక, నూతన సంవత్సరంలో తీసుకునే చర్యలపై వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, రౌడీ షీటర్లు, వీధి రౌడీలుగా చలామణి అయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తామన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై దృష్టి కేంద్రీకరిస్తామని, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ అవగాహనా, నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామన్నారు. ట్రాఫిక్‌ సమస్యల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. కమీషనరేట్‌ ప్రజలకు పోలీస్‌ల అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ఆటోల డాటాబేస్‌ తయారు చేస్తున్నామని, జనవరి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 01:02 AM