Share News

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:42 PM

కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌బ్రాంచి, రూరల్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గురువారం 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
నిందితుడిని అరెస్టు చూపుతున్న పోలీసులు

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 6: కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌బ్రాంచి, రూరల్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గురువారం 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు మూడు విభాగాలకు చెందిన పోలీసుల బృందం కరీంనగర్‌ రూరల్‌ మండలం గోపాల్‌పూర్‌ క్రాస్‌ రోడ్‌లోని దుర్శేడ్‌ గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బీమారం గ్రామంలో నివాసం ఉంటున్న) చందు నాగేశ్వరరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వీటి విలువ లక్షా 20 వేల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశామని రూరల్‌ సీఐ ప్రదీప్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సృజన్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవీందర్‌, కరీంనగర్‌ రూరల్‌ ఎస్‌ఐ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:42 PM