Share News

ఆన్‌లైన్‌లో పంట సాగు వివరాలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:57 PM

గ్రామాల్లో పంటల సాగు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో మండలంలో ఎంత పంట, ఏఏ పంటలు పండిస్తున్నారు. వాటికి కావలసిన ఎరువు లు, రైతులకు బీమా సౌకర్యం లాంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో పంట సాగు వివరాలు

కరీంనగర్‌ రూరల్‌, ఆగష్టు 24: గ్రామాల్లో పంటల సాగు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో మండలంలో ఎంత పంట, ఏఏ పంటలు పండిస్తున్నారు. వాటికి కావలసిన ఎరువు లు, రైతులకు బీమా సౌకర్యం లాంటి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కరీంనగర్‌ మండలంలో వరి పంటను సాగు చేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. రెండో పంటగా పత్తి పంటను ఎక్కువ సాగు చేశారు. పంటల సాగు ప్రక్రియను అధికారులు ఈ నెల 15 వరకు పూర్తి చేయాల్సి ఉండగా రైతులు వరినాట్లు ఆటస్యం కావడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం గడువును పొడగించింది. దీంతో ఈ నెల చివరి వరకు పంట సాగు నమోదు ప్రక్రియ కొనసాగనుంది.

పంటల సాగు వివరాల సేకరణకు ఏఈవోలకు ప్రత్యేక మోబైల్‌ యాప్‌ను కేటాయించి తెలంగాణ భూనక్షా (కడస్ర్టాల్‌ మ్యాప్‌)ను యాప్‌తో లింక్‌ చేశారు. ఇప్పటికే శాటిలైట్‌ సాంకేతికతతో ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారిత చిత్రపటాలను ధరణిలో వినియోగిస్తుండగా దీంతో పాటు పంటల సాగు వివరాలు నమోదు చేపట్టారు. ఏఈవోలు రైతు పొలం దగ్గరికి పోయిన తర్వాత భూనక్షా మ్యాప్‌ను ఆన్‌ చేయగానే ఆ ప్రాంత్రం 50మీటర్ల పరిధిలోని సర్వే నెంబర్లు కనిపిస్తాయి. రైతు పేరు, విస్తీర్ణం, ఆధార్‌ కార్డు, గ్రామం, గతంలో సాగు, ప్రస్తుతం సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. సాగు చేసిన పంటల వివరాలు యాప్‌లో నమోదు చేసి పంట ఫొటోను సైతం ఆప్‌లోడ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం భూనక్షా యాప్‌లో పంట సాగు వివరాలను నమోదు చేయడం వల్ల రైతులకు లాభదా యకంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి సత్యం తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాల అవసరం, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసేందుకు ఈ సర్వే తోడ్పడుతుందని తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 11:57 PM