Share News

కార్పొరేట్‌ చాయ్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:13 AM

తలనొప్పిగా ఉంది.. బయటికెళ్లి ఒక ‘టీ’ తాగాలి... అల్లం టీ, బెల్లం టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, శొంఠి టీ, బ్లాక్‌ టీ, ఇరానీ టీ. కుండ టీ.. ఇందులో ఏ ‘టీ’ తాగుదాం.. ఒకప్పుడు టీ అంటే సాంప్రదాయబద్ధంగా చేసేవిమాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.

కార్పొరేట్‌ చాయ్‌

- అందుబాటులోకి వివిధ రకాల టీలు

- రూపుమారిన టీ కొట్లు

- రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తలనొప్పిగా ఉంది.. బయటికెళ్లి ఒక ‘టీ’ తాగాలి... అల్లం టీ, బెల్లం టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, శొంఠి టీ, బ్లాక్‌ టీ, ఇరానీ టీ. కుండ టీ.. ఇందులో ఏ ‘టీ’ తాగుదాం.. ఒకప్పుడు టీ అంటే సాంప్రదాయబద్ధంగా చేసేవిమాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. అందుకు తగ్గట్టు పలు ఫ్రాంచైజీలు టీస్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. ఇంతకు ముందు టీస్టాల్స్‌లో కూర్చునేందుకు స్థలం కూడా ఉండకపోయేది. ఇప్పుడు కార్పొరేట్‌ లుక్‌లో టీస్టాల్స్‌ అదగరగొడుతున్నాయి.. మారుతున్న పోకడలకు అనుగుణంగా మారిన చాయ్‌లపై ‘ఆదివారం ప్రత్యేకం’..

‘సూడు...సూడు మని..చుట్టం ఇంటికి వస్తే చాయ బొట్టు పోద్దామంటే కసికెడన్ని పాలు కూడా లేక పాయే’ అనే మాటలు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వినిపించేవి. ఈ మాటలు చాయ మారుమూల పల్లె ప్రజల పానీయంగా మారి వారి జీవితాలతో ఎలా పెనవేసుకొని పోయిందో దర్పణం పడుతున్నాయి. కాస్మోపాలిటన్‌ నగరం నుంచి పల్లెటూరి ప్రజల వరకు చాయ తాగందే తెల్లవారదు. చాయ మన భారతీయ పానీయం కాదు.. బ్రిటిష్‌ వాళ్లు మనల్ని పాలించిన సమయంలో అది దేశంలోకి ప్రవేశించి ఇక్కడి ఆహారపానీయాల్లో ఒకటిగా కలగలిసి పోయింది. ఇంటికి మిత్రులో... చుట్టాలో వస్తే మంచినీరు, చాయ అందించడం కనీస మర్యాదగా మారిపోయింది. దీనితో ఊరూరా..నగరాల్లో వాడవాడనా...చాయ్‌ దుకాణాలు వెలిశాయి. ఉదయం పూట మాత్రమే చాయ్‌ తాగే అలవాటు ఉండేది. క్రమేపీ సాయంత్రం టీ తాగడం అలవాటైంది. ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదేసి సార్లు తాగనిదే రోజు గడవని స్థితికి చేర్చింది.

ఫ ఫ్రాంచైజీల రంగప్రవేశం

ప్రజలు చాయ్‌ తాగకుండా ఉండలేని తనాన్ని కార్పొరేట్‌ రంగం తన వ్యాపారంగా మార్చుకున్నది. ఎవరు చాయ్‌ చేసినా తేయాకు మాత్రమే వినియోగించాల్సి ఉన్నా కార్పొరేట్‌ రంగం రకరకాల బ్రాండ్‌ ఇమేజ్‌లను సృష్టించి వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. పూర్వకాలంలో గుడిసె హోటళ్లలో బొగ్గుల పొయ్యి మీద చాయ కాచి కేతిర్లలో నిలువచేసి అమ్మేవారు. ఆ తర్వాత చిన్నచిన్న హోటళ్లు వెలిశాయి. ఆ తర్వాత చాయ డబ్బాలు వచ్చాయి. ఇప్పుడు ఆ చాయ కాస్త రకరకాల బ్రాండ్‌ పేర్లతో సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలను ఆకర్షిస్తున్నది. మార్కెట్‌లో చాయ్‌ వాలా, బాబాయ్‌, టీ పాయింట్‌, టీ టైం, ఆర్మీ వాలా చాయ్‌ు, బెల్లం చాయ్‌, అమృతతుల్య, టీ కింగ్స్‌, ఇండియన్‌ కింగ్స్‌ వంటి ఎన్నో పేర్లతో ప్రత్యేక టీస్టాళ్లు వెలిశాయి. ప్రజలకు కొత్తకొత్త కార్పొరేట్‌ రుచులను చూపిస్తున్నాయి. ఈ స్టాళలను ఏర్పాటు చేయడానికి నిర్వహకులు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఆయా కంపెనీలకు చెల్లిస్తే టీపాయింట్‌ ఏర్పాటు చేసుకోవడానికి ఒక సెటప్‌ను ఇచ్చి టీ చేయడంలో శిక్షణ కూడా ఇస్తారు. తమకు మాత్రమే సొంతమైన రుచిగల టీ పౌడర్‌ను సమకూర్చుతారు. ఆ టీపౌడర్‌ను వాడి మాత్రమే టీ తయారు చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ టీపాయింట్లు రావడంతో అంతకుముందే విస్తరించి ఉన్న రాజస్తాన్‌ టీస్టాళ్ళవారు, ఇతర టీకొట్లు కొత్తకొత్త రుచులను అందించి తమ గిరాకీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ కొత్తకొత్త టీ తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు.

ఫ ఎన్నో రకాలు

దమ్‌టీ, జింజర్‌టీ, గ్రీన్‌టీ, బేసిల్‌ టీ, బెల్లం టీ, పింక్‌ టీ, లెమన్‌గ్రాస్‌ టీ, ఇమ్యూనిటీ టీ, లెమన్‌ టీ, తులసీ టీ, మసాలా టీ, కుల్లాడ్‌ టీ, బ్లాక్‌టీ, కశ్మీరి చాయ్‌, ఇరానీ టీ, కాఫీ, సూపర్‌ హెర్బ్‌ అశ్వగంధ్‌టీ వంటి టీ లను ఇస్తూ ప్రజలకు కొత్త రుచులు చూపుతున్నారు. గతంలో టిఫిన్‌, భోజన హోటళ్లలో టీ తయారు చేసి ఇచ్చే వారు. ఇప్పుడు వారు కాస్తా తమకు అనుబంధంగా టీ దుకాణాలను ఏర్పాటు చేయించి వారి నుంచి కొంత కమీషన్‌ తీసుకొని చాయ అమ్ముకునే అవకాశంం కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ టీ పాయింట్లలో ప్రత్యేక రుచి ఉండడంతో వాటిని నచ్చిన వారు ఆ ప్రత్యేక టీ పాయింట్లకే వెళ్లి టీ తాగుతుండడంతో కొన్ని టిఫిన్‌ సెంటర్లలో చాయ, కాఫీ ఇవ్వడం మానేశారు. మొత్తానికి బ్రిటీష్‌ వాళ్ళు ఫ్రీగా అందించి అలవాటు చేసిన టీ ఇప్పుడు కార్పొరేట్‌ రుచులతో ప్రజల అందుబాటులోకి వచ్చింది.

ఫ లాభాలు బాగానే ఉన్నాయి...

- కూస శేఖర్‌, కలెక్టరేట్‌ టీ టైం

కలెక్టరేట్‌ ప్రాంతం కావడంతో లాభాలు బాగానే ఉన్నాయి. టీ టైం కంపనీకి 4.5 లక్షలు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నాం. ప్రతీ నెలా ఆర్డర్‌ చేస్తే మెటీరియల్‌ వాళ్లే పంపిస్తారు. షాపు నిర్వహణ కోసం ఓ షెట్టర్‌ కిరాయి తీసుకున్నాం... నా ద్వారా కొందరు ఉపాధి పొందుతున్నారు.

ఫ చాయ్‌ చాలా బాగుంది..

- మల్లేశ్‌

చాయ్‌ చాలా ఉంది. ఎప్పుడు వచ్చినా ఇక్కడే తాగుతా. ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. నాణ్యత, ప్రమాణాలతో కూడిన తేనీరు అందిస్తున్నారు.

ఫ ఇరానీ చాయ్‌కు ప్రాధాన్యం

- షాహిద్‌ఖాన్‌, ఎల్లో కేఫ్‌ నిర్వాహకుడు

విద్యాసంస్థలకు నిలయమైన ముఖరంపురలో విద్యార్థులు, యువత ఇరానీ చాయ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలను బాగా మరగబెట్టి నాణ్యమైన చాయ్‌పత్తాలను వాడి చాయ్‌ తయారు చేస్తాం. పాలకు కూడా గిరాకి ఉంటుంది. బాగా మరిగిన పాలతో రుచి ఉంటుంది.

ఫ 13 రకాల టీని అమ్ముతున్నాం..

- నితీష్‌కుమార్‌, అమృతతుల్య టీ సెంటర్‌

సుమారు 13 రకాల టీ అమ్ముతున్నాం. గిరాకీ బాగా ఉంటోంది. ఎందరో ఈ రకరకాల చాయలను ఆస్వాదిస్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా చాయలను అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తాం.

ఫబెల్లం టీని ఎక్కువ ఇష్టపడుతున్నారు.

బి రవి, బెల్లం టీ బ్రాంచెస్‌ నిర్వాహకుడు

ప్రతిరోజు 600 వరకు బెల్లం టీలు అమ్ముతాం. ఎక్కువగా రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌, యువత బెల్లం టీ ని ఇష్టపడుతున్నారు. బెల్లం ఆరోగ్యానికి మంచిది. చాయపత్తి, యాలకుల పొడి, బెల్లం పౌడర్‌ కలిపి కంపెనీ పంపిస్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ఆర్డర్‌ చేస్తాం.

ఫ మట్టి కప్పుల్లో స్పెషల్‌ టీ

జె అంజయ్య, ఆర్మీ చాయ్‌ బార్‌ నిర్వాహకుడు

రెండు సంవత్సరాల క్రితం ఆర్మీ చాయ్‌ బార్‌ ఏర్పాటు చేశాం. బాగా నడుస్తుంది. మట్టి కప్పుల్లో టీని ఇస్తాం. ప్రతిరోజు 500 వరకు టీలు అమ్ముతున్నాం.

Updated Date - Oct 20 , 2024 | 01:13 AM