Share News

కాంగ్రెస్‌ పార్టీకి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చింది

ABN , Publish Date - May 08 , 2024 | 12:19 AM

అవినీతి, కుంభకోణాలు వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌కు ఎక్ప్సైరీ డేట్‌ వచ్చేసిందని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

 కాంగ్రెస్‌ పార్టీకి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చింది

భగత్‌నగర్‌, మే 7: అవినీతి, కుంభకోణాలు వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌కు ఎక్ప్సైరీ డేట్‌ వచ్చేసిందని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణ కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మీ ఆస్తి, అవినీతి, బినామీ ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్‌ విసిరారు. తాను సీబిఐకి లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని, సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్‌ తాను సుద్దపూసనని, మోదీ అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెబుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే నరేంద్రమోదీపై ఆరోపణలు చేస్తూ చర్చను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ అని, మచ్చలేని మోదీ 140 కోట్ల మందికి గ్యారెంటీ అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ కాస్తా రెండు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. చివరకు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిందన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ నేతలు డబ్బులు అడ్డగోలుగా ఖర్చు పెడుతూ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా పోటీలోఉన్న అభ్యర్థులను బేరీజు వేసుకుని ఓటు వేయాలన్నారు.

ఫ మోదీ సభను విజయవంతం చేయాలి

వేములవాడలో బుధవారం నిర్వహించనున్న మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రధాని వేములవాడకు చేరుకుని రాజన్నను దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

ఫ బీజేపీలోకి ఇద్దరు కార్పొరేటర్లు

బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు వంగల శ్రీదేవిపవన్‌, కొలిపాక అంజయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్‌, 47వ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు అన్నపూర్ణ, ఆపపెల్లి మాజీ సర్పంచు కాశెట్టి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పదం రాజు, మాండల అధ్యక్షుడు పాదం శివరాజు బీజేపీలో చేరారు. వారికి బండి సజయ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 08 , 2024 | 12:19 AM