Share News

రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమీ లేదు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:38 PM

రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమి లేదని, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తెలంగాణ కోసం ఉండేది బీఆర్‌ఎస్‌ పార్టీ అని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమీ లేదు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమి లేదని, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తెలంగాణ కోసం ఉండేది బీఆర్‌ఎస్‌ పార్టీ అని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ తరుపున రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఉండే కార్యకర్త నుంచి మొదలుకుని రాహుల్‌ గాంధి వరకు కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు సిగ్గు, భయం లేకుండా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నా మంటూ అబద్దాలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్సోళ్లకు పథకాలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలో అధికారంలోకి వచ్చిన అనేక పథకాలు అమలుచేస్తామని చెప్పిఒక్క పథకం అమలు చేయలేద న్నారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని హమీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంట్‌ ఎన్నికల్లో వాడుకుంటూ అగస్టు 15కి వాయిదా వేశాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. మంథని ఎమ్మెల్యే పోలీసులను వాడతాం, న్యాయపరంగా శిక్షలు విధిస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మంథని ప్రాంతంలో ఇసుక మాఫియా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా దండుకు పోతున్నదని, రేవంత్‌ రెడ్డి ఫొటోలతో ఇసుక లారీలు తిరుగుతున్నాయన్నారు. బియ్యం, స్ర్కాప్‌ దందా జరుగుతున్నా పట్టించుకునే వారు లేరని అన్నారు. పైగా బీఆర్‌ఎస్‌ను బదనాం చేస్తున్నారని, కాంగ్రెస్‌ పథకాలను నమ్మి మోసపోయామని ప్రజలు చెబుతున్నారని కొప్పుల ఈశ్వర్‌ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందనున్నారని జడ్పీ చైర్మన్‌ అన్నారు. జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో దౌర్జన్యాలు పెరిగి పోయాయని, సింగరేణి క్వార్టర్లను కూలగొట్టి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టి కార్మికుల పొట్ట గొడుతున్నారని, తక్షణమే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలను ఆపాలన్నారు. 26 వేల మంది సింగరేణి కార్మికులు కొప్పుల ఈశ్వర్‌ పక్షాన ఉన్నారని, వాళ్లు 2 లక్షల మంది ఓటర్లను ప్రభావితం చేస్తారని తెలిపారు. కొప్పుల గెలుపు తథ్యమని చందర్‌ అన్నారు. ఈ సమావేశంలో నారాయణదాస్‌ మారుతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:38 PM