Share News

గడీల దొరలకు.... గరీబోళ్ల బిడ్డకు పోటీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:13 AM

గడీల దొరలకు గరీబోళ్ల బిడ్డకు మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీ జరుగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

గడీల దొరలకు.... గరీబోళ్ల బిడ్డకు పోటీ

కరీంనగర్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గడీల దొరలకు గరీబోళ్ల బిడ్డకు మధ్య లోక్‌సభ ఎన్నికల పోటీ జరుగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ అనంతరం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ తనకు టికెట్‌ ఇవ్వగానే మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్‌ బిడ్డగా నామినేషన్‌ దాఖలు చేశానన్నారు. మోదీని మళ్లీ ప్రధానిగా చేసే అవకాశం కోసం కరీంనగర్‌ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తనను గెలిపిస్తే తాను మోదీకి మద్దతు తెలుపుతానని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్‌గాంఽధీకి మద్దతు తెలుపుతారని, ఎవరు ప్రధాని కావాలో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. వారు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తారని, తనను గెలిపిస్తే మీకోసం వేల కేసులు పెట్టినా పోరాటం చేస్తానన్నారు. వారి ఆస్తి వేల కోట్లు అయితే తన ఆస్తి ప్రజలే అన్నారు. పోరాటం చేస్తే పెట్టిన వందల కేసులున్నా ప్రజలే తన ఆస్తి అన్నారు. గడీల వారసులు కావాలా? గరీబొళ్ల బిడ్డ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులిద్దరూ కేసీఆర్‌ అనే నాణేనికి బొమ్మా బొరుసులాంటి వారన్నారు. భారతదేశాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మోదీకి మద్దతు ఇవ్వాలన్నారు. తాను పక్కా లోకల్‌ అని, నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతూ లాఠీ దెబ్బలు తిని వందలాది కేసులు పెట్టినా మీకు అండగా నిలిచానన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లానన్నారు. 317 జీవోకు నిరసనగా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే తన కార్యాలయం బద్దలు కొట్టి గుంజుకుపోయి జైలులో వేసినా భయపడలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకోసం కొట్లాడింది తానని, అగ్రవర్ణాల పేదల కోసం పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులెవరూ ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు అండగా ఉండలేదన్నారు. వేల కోట్లు సంపాదించుకున్నారని, వందల కోట్లు ఖర్చు చేయడానికి వస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులిద్దరూ ఏనాడైనా ప్రజల కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. తాను లోకల్‌ అని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాన్‌ లోకల్‌ అని, కాంగ్రెస్‌ అభ్యర్థి లోకలా.. నాన్‌ లోకలా అనేది చివరకు కాంగ్రెస్‌ కేడరే చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. దేశానికి మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు తెచ్చుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టీంలో బీజేపీకి మోదీ కెప్టెన్‌ అన్నారు. ఆ టీంలో మేమంతా సభ్యులుగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ టీంకు ఎవరు కెప్టెన్‌ అని కెప్టెన్‌ లేకుండా బరిలోకి దిగుతున్న టీంను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఇక్కడున్న మంత్రి ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదని, మాట్లాడితే తన్నుడు గుద్దుడు, వెధవ అంటూ తిట్టడం తప్ప సాధించేదేమి లేదన్నారు. ఈ దేశానికి మోదీ చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను గుర్తుకు తెచ్చుకుని, మోదీని బలపర్చేందుకు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్‌

- బీజేపీరాష్ట్ర అద్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్‌ మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌నామినేషన్‌ కార్యక్రమానికి హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను చూసిన తర్వాత బండి సంజయ్‌ ప్రచారం చేయకుండానే గెలుస్తాడని అనిపిస్తోందన్నారు. కరీంనగర్‌ ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, గెలుపు ఖాయమైందన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని కోరారు. 400 సీట్లతో మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ మళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలను సిగ్గులేకుండా కాంగ్రెస్‌లోకి పంపి రాజకీయం చేస్తున్నాడన్నారు. వైస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి, కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు. తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలువబోతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను బేరీజు వేసుకుని ఓటు వేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దోచుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.

బండి సంజయ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

- గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయిపటేల్‌

గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయిన గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్‌ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కోసం నిత్యంపోరాటం చేసే బండి సంజయ్‌కుమార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తనను మోదీ గుజరాత్‌ నుంచి కరీంనగర్‌కు పంపించారన్నారు. 400 సీట్లలో విజయాన్ని అందించేందుకు తెలంగాణాలోని 17 సీట్లలో బీజేపీని గెలిపించాలనికోరారు.

బీజేపీ అభ్యర్థిగా బండి నామినేషన్‌

కరీంనగర్‌పార్లమెంట్‌ నియోజక వర్గానికి బీజేపీజాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ గురువారం ఎన్నికల అధికారి పమేలా సత్పతికి నామినేషన్‌ పత్రాలను అందించారు. బండి సంజయ్‌కుమార్‌ నామినేషన్‌ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రరజనీకాంత్‌భాయ్‌ పటేల్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు బీజేపీ నాయకులు గండ్ర నళిని, కిరణ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రరజనీకాంత్‌భాయ్‌ పటేల్‌, కిషన్‌రెడ్డిలకు హెలిప్యాడ్‌ వద్ద బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌కుమార్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడికృష్ణారెడ్డి, ప్రతాపరామక్రిష్ణలు ఘనస్వాగతం పలికారు. కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయి పటేల్‌, కిషన్‌రెడ్డితో పాటు బండిసంజయ్‌ ఎన్నికల అధికారి కార్యాలయంలో వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ఎస్సారార్‌ కళాశాల వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు.

కదం తొక్కిన కాషాయ దళం

భగత్‌నగర్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌నామినేషన్‌ సందర్భంగా కరీంనగర్‌లో కాషాయ దళం కదం తొక్కింది. నగరంలోని ఎస్సారార్‌ కళాశాల వద్ద ప్రారంభమైన నామినేషన్‌ బైక్‌ ర్యాలీ టవర్‌సర్కిల్‌మీదుగా గీతాభవన్‌ వరకు సాగింది. మండుటెండను సైతం లెక్కచేయక వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. మూడు గంటల పాటు సాగిన ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కలిసి ఓట్లు అడగండి

భగత్‌నగర్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్థించాలని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ నాయకులకు సూచించారు. గురువారం నగరంలోని పార్లమెంట్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై, అభ్యర్థులపై ఆ పార్టీల కార్యకర్తలు అసహనంతో ఉన్నారన్నారు. ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలను కలిసి గొడవలకు అస్కారం లేకుండా సుహృద్భావ వాతావరణంలో వారిని కలిసి ప్రచారం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమపథకాలను వారికి వివరించాలన్నారు. 28, 29 తేదీల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు. మండలానికి మూడు స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహంచాలన్నారు. వచ్చే నెల 4నుండి అసెంబ్లీనియోజక వర్గాల వారీగా భారీ ఎత్తున సభలునిర్వహిస్తామన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:13 AM