Share News

ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:59 PM

ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు.

ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌
మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

వేములవాడ, జనవరి 17: ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్‌ కాలనీలో బుధవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత నేరాల నియంత్రణ కోసం ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రమం తప్పకుండా కమ్యూనిటీ కాంటాక్ట్‌ పేరిట సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల రక్షణ పోలీస్‌ శాఖ బాధ్యతని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్‌ తీసుకొని ఉంటే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డైవ్రింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, ప్రతీ వాహనదారుడు వాహనాలకు నంబరు ప్లేట్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మొబైల్‌ ఫోన్‌లకు వచ్చే లింక్స్‌ ఓపెన్‌ చేయకూడదని, ఓటీపీ ఎవరికీ చెప్పవద్దని అన్నారు. ఒకవేళ సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్‌ చేయాలన్నారు. గంజాయి, జూదం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి తాగినా, విక్రయించినా నేరమని అన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్‌ వారికి సమాచారం అందించాలన్నారు. గ్రామా లలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ రాహుల్‌ రెడ్డి, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు కరుణాకర్‌, కృష్ణకుమార్‌, కిరణ్‌ కుమార్‌,

ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:59 PM