Share News

రేచపల్లిలో కలకలం..

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:16 AM

అది జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మడలం రేచపల్లికి వెళ్లే రోడ్డు.. ఆదివారం తెల్లవారు జామున ఆ రోడ్డుపై రెండు నంబర్‌ప్లేట్‌ లేని వాహనాలు కనిపించాయి. ఆ వాహనాల్లో నుంచి దిగిన ఎనిమిది మంది వ్యక్తులు హిందీలో ఏదో మాట్లాడుకుంటున్నారు.. అటువైపు వెళ్లిన బట్టపల్లి గ్రామానికి రైతులు వారిని గమనించి చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి వచ్చిన ముఠాగా భావించారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.

రేచపల్లిలో కలకలం..
రాజేశంను విడుదల చేయాలని కోరుత్నున్న భార్య, కుమారుడు

- పోలీసుల అదుపులో పౌర హక్కుల సంఘం నేత రాజేశం

- నాటకీయ పరిణామాల మద్య ఛత్తీస్‌గఢ్‌కు తరలింపు

- కిడ్నాపర్లుగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు

అది జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మడలం రేచపల్లికి వెళ్లే రోడ్డు.. ఆదివారం తెల్లవారు జామున ఆ రోడ్డుపై రెండు నంబర్‌ప్లేట్‌ లేని వాహనాలు కనిపించాయి. ఆ వాహనాల్లో నుంచి దిగిన ఎనిమిది మంది వ్యక్తులు హిందీలో ఏదో మాట్లాడుకుంటున్నారు.. అటువైపు వెళ్లిన బట్టపల్లి గ్రామానికి రైతులు వారిని గమనించి చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేయడానికి వచ్చిన ముఠాగా భావించారు. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. వారు వాహనాల్లో వచ్చిన వారిని నిలదీయంతో తాము ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన పోలీసులమని తెలిపారు. దీంతో గ్రామస్థులు సారంగపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి వారితో మాట్లాడి ఛతీస్‌గఢ్‌ పోలీసులు అని నిర్ధారించుకుని వెళ్లిపోయారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన పోలీసులు రేచపల్లికి వెళ్లి పౌరహక్కుల సంఘం నేత పోగుల రాజేశంను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

- ఆంధ్రజ్యోతి, జగిత్యాల/ సారంగాపూర్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గీదం పోలీస్‌స్టేషన్‌కు సంబందించిన పోలీసులు సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా కోశాధికారి రాజేశంను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దంతేవాడ జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌లో గల ఓ కేసులో విచారణ కోసం తీసుకవెళ్తామని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఇదేమిటని కుటుంబసభ్యులు ప్రశ్నించినప్పటికీ బలవంతంగా రాజేశంను, అతని భార్య మల్లీశ్వరిని వాహనంలో తీసుకెళ్లారు. రేచపల్లి శివారులోకి వెళ్లిన అనంతరం రాజేశం భార్య మల్లీశ్వరిని వాహనం నుంచి దింపివేసి వెళ్లిపోయారు. రాజేశంను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుళ్లారని ఆయన మల్లీశ్వరి, కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయమై సారంగపూర్‌ ఎస్‌ఐ తిరుపతి మాట్లాడుతూ రేచుపల్లి గ్రామానికి వచ్చి రాజేశంను తీసుకవెళ్లింది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గీదం పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బందిగా ధ్రువీకరించుకున్నామని తెలిపారు. తీవ్రవాదానికి సంబందించిన ఓ కేసులో నిందితుడిగా ఉన్న రాజేశంను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారన్నారు.

రాజేశంను వెంటనే విడిచిపెట్టాలి

- రాజేశం భార్య మల్లీశ్వరి, కుమారుడు శ్రీనివాస్‌

పౌరహక్కుల సంఘం నేత రాజేశంను వెంటనే విడిచిపెట్టాలని ఆయన భార్య మల్లీశ్వరి, కుమారుడు శ్రీనివాస్‌లు కోరుతున్నారు. ఆదివారం జగిత్యాల డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. రేచపల్లి గ్రామానికి గుర్తు తెలియని వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు బలవంతంగా రాజేశంను తీసుకవెళ్లారన్నారు. విషయాన్ని పోలీసులకు అందించగా ఛత్తీస్‌గఢ్‌కు ఓ కేసు విచారణలో రాజేశంను అక్కడి పోలీసులు తీసుకవెళ్లారని అంటున్నారని, తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాజేశంను వెంటనే విడిచి పెట్టాలని కోరారు.

రాజేశం కిడ్నాప్‌ను ఖండిస్తున్నాం

- మాదన కుమార స్వామి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి

పోగుల రాజేశంను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా పలువురు వ్యక్తులు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులుగా చెప్పుకుంటూ రాజేశంను తీసుకవెళ్లడం సమంజసం కాదన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ఫోన్‌ ద్వారా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ను సంప్రదించగా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాజేశంను అక్రమ నిర్బందం నుంచి వెంటనే విడిపించాలని డిమాండ్‌ చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న పౌర హక్కుల సంఘం కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు, మేదావులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు అక్రమ అరెస్టులు, నిర్బందాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ఉపాధ్యక్షుడు నార వినోద్‌, సహాయ కార్యదర్శి గడ్డం సంజీవ్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యులు కడ రాజన్న, మోటపలుకుల వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:16 AM