Share News

సింగరేణి కార్మిక సంఘ నాయకులతో బొగ్గు పెన్షన్‌దారుల భేటి

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:30 PM

హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బీ జనక్‌ప్రసాద్‌తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై చర్చించారు

సింగరేణి కార్మిక సంఘ నాయకులతో బొగ్గు పెన్షన్‌దారుల భేటి
కార్మిక సంఘాల ప్రతినిధులకు వినతి పత్రం అందజేస్తున్న పెన్షన్‌దారులు

సమస్యలను పరిష్కరించాలని వినతి

గోదావరిఖని, జూన్‌ 17: హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బీ జనక్‌ప్రసాద్‌తో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. వీటిలో ముఖ్యమైన కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ పెంచాలని, చమురు సంస్థల్లో విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చినట్లుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పోస్ట్‌ రిటైర్డ్‌ మెడికేర్‌ స్కీం(సీపీఆర్‌ఎస్‌) ప్రస్తుతం ఎనిమిది లక్షల రూపాయలు ప్రస్తుత వైద్య సేవలకు సరిపోవడంలేదని ప్రస్తుత ధరలకు అనుగుణం గా మెడికల్‌ పరిమితి పెంచి ఆదుకోవాలన్నారు. హైదరాబాద్‌లో నెల వారీ మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలని, రెండు నెలల క్రితం జరిగిన సీపీఆర్‌ఎస్‌ ట్రస్టు బోర్డు సమావేశంలో జరిగిన నిర్ణయాలను అమలు పరచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్‌మైన్స్‌ పెన్షన్‌ చట్టం సవరించి బొగ్గు పెన్షన్‌దారులకు పెన్షన్‌ పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్రప్రభుత్వం లేఖ రాసి, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు. అతి తక్కువ సీఎంపీఎఫ్‌ పెన్షన్‌ పొందుతున్న వారికి కూడా ఆసరా పెన్షన్‌ ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన కార్మిక సంఘ నాయకులు త్వరలో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగరేణి రిటైర్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దండం రాజ్‌ రామచందర్‌రావు, ఉప ప్రధాన కార్యదర్శి ఆళ వందార్‌ వేణు మాధవ్‌, కోల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కేఆర్‌సీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం బాబురావు, మాజీ డైరెక్టర్‌ జేవీ దత్తాత్రేయులు, నర్సింగ్‌రావు, జీ కనకయ్య, పూర్ణప్రకాష్‌, సాయిరాం గౌడ్‌, వెంకటరమణ, మాధవరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు వంగ వెంకట్‌, మోట పలుకుల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:30 PM