Share News

పుకార్లకు చెక్‌ పెడుతూ..

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:13 AM

మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు.. మేయర్‌ సునీల్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కార్పొరేటర్లు కాంగ్రెస్‌, బీజేపీ వైపు తొంగిచూస్తూ జంప్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.. అంటూ వస్తున్న వార్తలు బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించాయి. ఆ పార్టీశ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. కేసీఆర్‌కు ఉద్యమ కాలం నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు అండగా నిలిచిన్న కరీంనగర్‌ జిల్లాలో ఏమి జరుగుతోంది అంటూ అన్ని రాజకీయపక్షాలు ఇటువైపు దృష్టిసారించాయి. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఒక్క భేటీతో ఈ ప్రచారాలకు చెక్‌ పెట్టినట్లు తెలిసింది

పుకార్లకు చెక్‌ పెడుతూ..
మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు

- కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మేయర్‌, కార్పొరేటర్లు

- రెండునెలల్లో అన్ని సర్దుకుంటాయన్న కేసీఆర్‌

- అధినేతతో భేటీతో పార్టీ మారే యోచనకు స్వస్తి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు.. మేయర్‌ సునీల్‌రావు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కార్పొరేటర్లు కాంగ్రెస్‌, బీజేపీ వైపు తొంగిచూస్తూ జంప్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.. అంటూ వస్తున్న వార్తలు బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించాయి. ఆ పార్టీశ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. కేసీఆర్‌కు ఉద్యమ కాలం నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు అండగా నిలిచిన్న కరీంనగర్‌ జిల్లాలో ఏమి జరుగుతోంది అంటూ అన్ని రాజకీయపక్షాలు ఇటువైపు దృష్టిసారించాయి. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఒక్క భేటీతో ఈ ప్రచారాలకు చెక్‌ పెట్టినట్లు తెలిసింది. ‘రెండు నెలల్లో మనకు మంచి రోజులు వస్తాయి. రాజకీయంగా గెలుపు ఓటములు సహజం. నిలదొక్కుకొని ముందుకు సాగాలి’ అని కేసీఆర్‌ ఆత్మస్థైర్యం నింపడంతో జిల్లా నేతలు బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది.

ఫ పార్టీని వీడబోమంటూనే..

ఇంతకాలం బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరబోమని చెబుతూనే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ నేతలతో రహస్యబేటీలు, చర్చలు చేస్తూ వచ్చారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించామని చెప్పినా ఆ కలయిక వెనుక రాజకీయ కోణం కూడా లేక పోలేదని అందరూ బాహటంగానే చర్చించుకున్నారు. ఏయే కార్పొరేటర్‌, ఏ పార్టీలోకి వెళ్తున్నాడు. ఏయే నేత ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నాడు... అంటూ వారిపేర్లను పేర్కొంటూ బాహటంగానే ఆయా పార్టీల్లో చర్చించుకోవడం, మీడియాలో రావడం అందరూ చూశారు. శుక్రవారం మేయర్‌ సునీల్‌రావు బండి సంజయ్‌కుమార్‌ను కలిసి అభినందించడంతోపాటు స్మార్ట్‌సిటీ రావడానికి చేసిన కృషి ఆయనదేనంటూ ఇంతకాలం చేసిన ప్రకటనలకు భిన్నంగా ప్రశంసించారు. ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైందని ప్రచారం జరిగింది. రాజకీయ కలకలాన్ని సృష్టించింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో పేర్కొనడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. అది అసత్య ప్రచారమని, బీఆర్‌ఎస్‌ వీడేది లేదని గంగుల కమలాకర్‌ ప్రకటించినా బీఆర్‌ఎస్‌లో, రాజకీయవర్గాల్లో అనుమానాలు తొలిగిపోలేదు. వీటన్నింటి నేపథ్యంలో కరీంనగర్‌ రాజకీయాలు వేడెక్కి పోయాయి.

ఫ కేసీఆర్‌తో నాయకుల భేటీ

ఆదివారం బీఆర్‌ఎస్‌కు 30 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిలో అందుబాటులో 28 మంది కార్పొరేటర్లు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్‌, సిద్దిపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అక్కడే ఉన్నారు. అధినేతను కలిసిన కరీంనగర్‌ నేతలు తాము బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో, కాంగ్రెస్‌లో చేరుతున్నారని వస్తున్న సమాచారాన్ని ప్రస్తావించి వాటిని నమ్మవద్దని తాము పార్టీని వీడబోమని చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారికి ధైర్యం చెబుతూ రాజకీయపార్టీలు అన్నాక ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయి.. అవి సహజం.. ఓటమి పొందినంత మాత్రాన కుంగి పోవలసిన అవసరం లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయి.. గ్రామీణ ప్రాంతాల్లో మన బలమేమి తగ్గలేదు.. ఓటు బ్యాంకులో తేడాలేదు... కేవలం ఒకశాతం ఓట్లతో మనం పరాజయం పాలయ్యాం.. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయి.. రెండు నెలల్లోనే మంచి ఫలితాలను చూస్తాం.. అంటూ ఆత్మస్థయిర్యాన్ని నింపారని తెలిసింది. ఇదే సందర్భంలో కేసీఆర్‌ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిని కరెంటు కోతలు, సాగుతాగునీటి సమస్యలు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలు మన ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఆయా అంశాల విషయంలో ఉన్న తేడాను గమనిస్తున్నారు అని చెప్పినట్లు సమాచారం. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులతో భేటీ అనంతరం తాము బీఆర్‌ఎస్‌లోనే ఉంటామని పార్టీని వీడేది లేదంటూ కరీంనగర్‌ నేతలు ప్రకటించి జిల్లాకు తిరిగి వచ్చారు. అధినేతతో బేటీ బీఆర్‌ఎస్‌ నేతల వలసలకు అడ్డుకట్ట వేస్తుందా లేదా అన్నది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికర చర్చగా మారింది.

Updated Date - Jun 24 , 2024 | 01:13 AM