Share News

తుదిదశకు ప్రచారం.. అగ్రనేతలపైనే భారం

ABN , Publish Date - May 08 , 2024 | 01:12 AM

మరో నాలుగు రోజుల్లో ప్రచారగడువు ముగియనుండగా అధినేతలను రప్పించి వారి సందేశాలను ప్రజలకు అందేలా చూసి విజయానికి బాటలు వేసుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీకి తెర లేవడంతో రాజకీయ పక్షాలన్నీ చివరి ప్రయత్నాలుగా అధినేతలతో సభలు ఏర్పాటు చేశాయి.

 తుదిదశకు ప్రచారం.. అగ్రనేతలపైనే భారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మరో నాలుగు రోజుల్లో ప్రచారగడువు ముగియనుండగా అధినేతలను రప్పించి వారి సందేశాలను ప్రజలకు అందేలా చూసి విజయానికి బాటలు వేసుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీకి తెర లేవడంతో రాజకీయ పక్షాలన్నీ చివరి ప్రయత్నాలుగా అధినేతలతో సభలు ఏర్పాటు చేశాయి.

ఫ వేములవాడలో మోదీ సభకు భారీ ఏర్పాట్లు

బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ఈనెల 8న వేములవాడలో జరుగనున్న జనసభపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్న ఈసభకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మందిని సమీకరించి ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలని అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలిసారి వేములవాడకు వస్తున్న నరేంద్రమోదీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కరీంనగర్‌ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొనాల్సి ఉండగా చివరి క్షణంలో ఆ సభ రద్దయింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహించి వెళ్లినా ప్రధాని మోదీ సభ జరిగితే తనకు ప్రయోజనం ఉంటుందని భావించిన బండి సంజయ్‌కుమార్‌ ప్రధాని పర్యటన ఖరారు చేయించుకోవడంలో సఫలమయ్యారు. ఈ సభ పార్టీశ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది.

ఫ అగ్రనేతల సభల కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు

కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా ఈనెల 7న కరీంనగర్‌ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అకాలవర్షం, గాలులతో సభ ప్రాంగణంలో టెంట్లు కూలిపోయి కుర్చీలు కొట్టుకుపోయి కార్యక్రమం రద్దయింది. సభకు వచ్చిన జనం వర్షంలో ఉండలేక ఇళ్లకు తిరిగి వెళ్ళడంతో సభను రద్దు చేసుకోవలసి వచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 9న రేవంత్‌రెడ్డి సభ జరుగాల్సి ఉండగా దానిని 7వ తేదీకి మార్చారు. అనుకోని పరిస్థితుల్లో ఈసభ రద్దు కావడంతో ముందుగా అనుమతి తీసుకున్న మేరకు 9న తిరిగి రేవంత్‌రెడ్డి సభ నిర్వహించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే జమ్మికుంట, సిరిసిల్ల సభల్లో ప్రచారం నిర్వహించారు. ఈ రెండు సభలు జరిగిన ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడి పోలింగ్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ సభలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రత్యేక దృృష్టిసారించి కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఆ క్రమంలోనే రేవంత్‌రెడ్డి సభ ఏర్పాటు చేసి మరింత లబ్ధిపొందాలని చూస్తున్నది. ఈనెల 11న ప్రచార ఘట్టం ముగియనుండగా రాహుల్‌గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ రప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

ఫ కేసీఆర్‌ రోడ్‌షోపై బీఆర్‌ఎస్‌ ఆశలు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ నియోజకవర్గంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ మాజీ ఎంపీగా ఆయనకున్న విస్తృత సంబంధాలతో తన ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. వీణవంకలో పార్టీ నేతలతో కేసీఆర్‌ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈనెల 9న ఆయన కరీంనగర్‌ కేంద్రంగా రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించాలని కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన పార్టీగా బీఆర్‌ఎస్‌ ధీమాగా ప్రచారం నిర్వహిస్తున్నది. అవసరమైతే ఆయన మరో రోజు కూడా ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించేలా కార్యక్రమం రూపొందించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారని సమాచారం. ప్రచార గడువు ముగియడానికి నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా ప్రజలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా వగమనిస్తున్నారు.

-=---------------

Updated Date - May 08 , 2024 | 08:36 AM