పూర్వ వైభవానికి బీఆర్‌ఎస్ తహతహ
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:05 AM
తెలంగాణ మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి రాష్ట్ర సాధన వరకు, ప్రభుత్వ ఏర్పాటులోనూ బీఆర్‌ఎస్ పార్టీకి, దాని అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ పునర్‌వైభవం సాధించాలని తహతహలాడుతోంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెలంగాణ మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నాటి నుంచి రాష్ట్ర సాధన వరకు, ప్రభుత్వ ఏర్పాటులోనూ బీఆర్‌ఎస్ పార్టీకి, దాని అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ పునర్‌వైభవం సాధించాలని తహతహలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానాన్ని మినహా పన్నెండింటిలో విజయాన్ని సాధించి ఈ గడ్డ తన కంచుకోటగా చెప్పుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఐదు స్థానాలకే పరిమితమైపోగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను గెలుచుకున్నది. ఇటీవల జరిగిన పరిణామాల్లో జగిత్యాల శాసనసభ్యుడు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ సంఖ్య నాలుగుకు పడిపోయింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేల్చుకుంటానని ఆమరణ నిరాహారదీక్షకు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు తరలివెళ్లిన సందర్భాన్ని బీఆర్‌ఎస్ పార్టీ దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. ఈ నెల 29న ఆ దీక్షా దివస్‌ను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లాలో సెంటిమెంట్‌ను మరోసారి రగిల్చి ఈ ఉమ్మడి జిల్లాలో మళ్లీ తనపట్టును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత అదే సంవత్సరం మే 17న కరీంనగర్‌లో సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేసీఆర్ మలిదశ ఉద్యమానికి శంఖం పూరించారు. ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రతి కీలక ఘట్టంలోనూ కరీంనగర్ కీలకపాత్ర వహిస్తూ వచ్చింది. కేసీఆర్‌ను 2004లో ఆ తర్వాత 2006, 2008 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మూడుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిపించింది. తన సెంటిమెంట్ జిల్లాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పలు పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. అలాంటి చోట టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత చేదు ఫలితాలను చవిచూసింది.
కరీంనగర్‌లో ప్రతికూల పవనాలు వీస్తుండడం బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు జీర్ణం కాని అంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 మాసాలు అవుతున్నా ఆ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని భావిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ ఈ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకవెళ్ళాలని నిర్ణయించింది. అధికార పార్టీ వైఫల్యాలపై రాజకీయ దాడి కొనసాగించి మళ్లీ ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపాలని అందుకు దీక్షా దివస్‌ను వినియోగించుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేసింది. కేసీఆర్‌ను 2009 నవంబర్ 29న అరెస్టు చేసిన అల్గునూరు కేంద్రంగా దీక్షాదివస్‌ను నిర్వహించి భారీ బహిరంగ సభ జరుపాలని నిర్ణయించారు. 30వేల మందికి తగ్గకుండా ఈ సభకు జనం హాజరయ్యేలా చూడాలని పార్టీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సమావేశానికి హాజరై ప్రసంగించనున్నారని సమాచారం. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9వరకు దీక్షా దివస్ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 11రోజులపాటు జరిగే దీక్షా దివస్ కార్యక్రమాలను సెంటిమెంట్ రగిల్చే విధంగా నిర్వహించాలని, ప్రభుత్వ వైఫల్యాలను అమలుకు నోచుకోని పథకాలను ప్రజలకు వివరించి తిరిగి ప్రజల్లో రాజకీయంగా బీఆర్‌ఎస్ సానుకూలవైఖరి పెంపొందించుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ సానుకూల వైఖరిని పెంచుకోవడం ఎంతైనా అవసరమని వారు భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో పట్టుసాధించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదుగాలని ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
సభా స్థలాన్ని పరిశీలించిన నాయకులు
తిమ్మాపూర్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్ష నిర్వహిస్తున్న కేసీఆర్‌ను నవంబర్ 29న అలుగునూర్ వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసిన సందర్బంగా ఈ నెల 29న అలుగునూర్ వద్ద దీక్షా దీవస్ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం అలుగునూర్‌లో నిర్వహించే దీక్షా దివస్ సభా సఽ్ధలాన్ని, ఏర్పాట్లను గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి.రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.