కేసీఆర్ సభపై బీఆర్‌ఎస్ ఆశలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:05 AM
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని చూస్తున్నది. తెలంగాణ ఉద్యమకాలంలో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి సందర్భంలోనూ బీఆర్‌ఎస్‌కు, దాని అధినేత కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ సెంటిమెంట్‌గా మారిన ఉమ్మడిజిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పైచేయి సాధించాలని ఆ పార్టీ నాయకులు, శ్రేణులు భావిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని చూస్తున్నది. తెలంగాణ ఉద్యమకాలంలో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి సందర్భంలోనూ బీఆర్‌ఎస్‌కు, దాని అధినేత కేసీఆర్‌కు వెన్నంటి ఉంటూ సెంటిమెంట్‌గా మారిన ఉమ్మడిజిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పైచేయి సాధించాలని ఆ పార్టీ నాయకులు, శ్రేణులు భావిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కరీంనగర్ నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించడంతో అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ సభ తర్వాత రోడ్‌షోలు
ఈనెల 12న కరీంనగర్‌లో జరుగనున్న కరీంనగర్ కదనభేరి సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించి సింహగర్జన సభ నాటి రోజులను పునరావృతం చేయాలని, తద్వారా బీఆర్‌ఎస్ ప్రాభవాన్ని మళ్లీ చాటాలని వారు భావిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌ను, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. వీరిద్దరు తమ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే నాయకులను, శ్రేణులను కలుస్తూ వారిని ఎన్నికల దిశగా సమాయత్తం చేస్తున్నారు. కదనభేరి సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ఆ తర్వాత ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించాలని వాటిలో కేసీఆర్ పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. కదనభేరి సభలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి లక్షకు తగ్గకుండా ప్రజలను సమావేశానికి హాజరయ్యేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుని అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నాలుగు నియోజకవర్గాలైన చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్, వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్‌కే ఐదు వేల పైచిలుకు ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఐదు వేల ఓట్ల ఆధిక్యాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని భావించిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో సమాన ఓట్లను సాధించామని పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సత్తాచూపి విజయాన్ని సాధించాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నది.
ఫ సత్తా చాటాలని తహతహ
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తమకు ముక్కోణపు పోటీ జరుగనున్న నేపథ్యంలో కష్టపడితే విజయం సాధించవచ్చని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీపై దేశంలో ఉన్న సానుకూలత ప్రస్తుతం పెద్దగా లేదని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ రైతుబంధు నిధులు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో జమకాక పోవడం, రుణమాఫీ పథకం అమలుకు నోచుకోక పోవడం, మహిళలకు 2,500 రూపాయల సాయం అందించే పథకం ప్రారంభించక పోవడం తమకు కలిసివస్తుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీకే పరిమితమైన నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీ ఓట్లను చీల్చుకుని విజయం సాధించిందని, ఇప్పుడు ముక్కోణపు పోటీ తమకు కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. కరీంనగర్‌లో విజయం సాధించడం ద్వారా మళ్లీ ఈ జిల్లాను బీఆర్‌ఎస్ కంచుకోటగా మార్చవచ్చని అనుకుంటున్నారు. కేసీఆర్ పాల్గొననున్న కదనబేరి సభ ఇందుకు తోడ్పడుతుందని వారు ధీమాగా ఉన్నారు. స్థానిక నేతల తీరుసై కోపాన్ని ప్రదర్శించిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని అయితే కేసీఆర్ అధికారంలో లేక పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ప్రజల్లో ఉన్న ఈ భావనే వారిని బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓట్లు వేసేలా చేస్తుందని భావిస్తున్నారు.