Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - May 31 , 2024 | 12:45 AM

ఎండలు మండిపోతున్నాయి.

భానుడి భగభగలు

కరీంనగర్‌ టౌన్‌, మే 30: ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. ఈయేడు రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయని వాతావరణశాఖ తెలుపడంతో జనం ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో మూడు, నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంటూ గత వారంలో వాతావరణ చల్లని కబురు చెప్పడంతో రోహిణి కార్డె ఆరంభంలోనే వానలు పడితే ఇక ఎండల బాధలు పోతాయని, వర్షాలు పడితే బాగుండు అని అంతా వానదేవుడిని వేడుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభమై ఐదురోజులు దాటుతున్నా ఒక్క చినుకు కూడా పడలేదు. అప్పుడప్పుడు వస్తున్న మబ్బులను చూసి వర్షాలు పడతాయని ఆశిస్తే నిరాశే మిగిలుతోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పటికే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియగా కరీంనగర్‌ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఓ మోస్తరు వర్షం కూడా పడలేదు. దీనితో రైతులు వర్షం పడితే చాలు పంటలు సాగు చేసుకునేందుకు సన్నద్ధమై ఆకాశం వైపు చూస్తున్నారు. వారం రోజులుగా జిల్లా అంతటా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జిల్లాలో అత్యధికంగా జమ్మికుంటలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిమి 46 డిగ్రీలకుపైగానే ఉంటుంది. మిగిలిన జిల్లా అంతటా కూడా 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులపాటు ఇదే విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.

కేరళకు రుతుపవనాలు

గురువారం కేరళకు నైరుతీ రుతుపవనాలు రావడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఉదయం 6 గంటల నుంచే భానుడు సుర్రు మనిపించడంతో బయటికి వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు ముఖ్యకూడళ్లు జనం లేక వెలవెలబోతున్నాయి. జంతువులు, పక్షులు, మూగజీ వాలు ఎండ వేడిమిని తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు వేడిమిని భరించలేక నానా యాతనపడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదని, ఇంట్లో ఉండలేక పోతున్నామని, రాత్రి 11 గంటల వరకు కూడా వేడి గాలులు వీస్తున్నాయని జనం ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెక్కాడితేకానీ డొక్కాడని కూలీలు, ఆటోలు, రిక్షా కార్మికులు, వీధివ్యాపారులు, చిరువ్యాపారులు బతుకుబండిని లాగేదెట్లా అంటూ ఆందోళనలో ఉన్నారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నందున అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఉదయం 10 తర్వాత సాయంత్రం 6 గంటల వరకు బయటకు రావద్దంటూ డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకో వాలని తెలుపుతున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:45 AM