Share News

బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు గాడిన పడేనా?

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:08 AM

నిధులు లేక బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా సబ్సిడీ అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు గాడిన పడేనా?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నిధులు లేక బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా సబ్సిడీ అందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి ఇవి గుర్తుకు వచ్చాయి. ఆఘమేఘాల మీద కొన్ని పథకాలను ప్రకటించి తక్కువ వ్యవధిలోనే దరఖాస్తులను ఆహ్వానించి కొంత మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చారు. వాటిని ఏ లక్ష్యం కోసమైతే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను మరిచిపోవడం నిరుద్యోగులకు శాపంగా మారింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లకు తోడు మరిన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో సబ్సిడీ పథకాలపై ఆశలు పెంచుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రజక, నాయీబ్రాహ్మణ, శాలివాహన(కుమ్మరి), విశ్వబ్రాహ్మణ, మేదరి, వడ్డెర, సగర(ఉప్పర), క్రిష్ణ బలిజ (పూసల), వాల్మీకి(బోయ), భట్రాజు, గౌడ సమాఖ్యలు ఉన్నాయి. వీటి ద్వారా వ్యక్తిగతంగా, గ్రూపుల వారీగా వృత్తిపరంగా ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ప్రతి ఏటా సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సి ఉండగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రతి ఏటా రుణ ప్రణాళికను రూపొందించాల్సి ఉండగా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు బీసీ కార్పొరేషన్‌ ఉందా, లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే బీసీ కార్పొరేషన్‌ ద్వారా పలు పథకాలను ప్రకటించింది. 50 శాతం నుంచి మొదలుకుని వంద శాతం సబ్సిడీ వరకు ఇచ్చే రుణాలను అమలుచేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా పెద్దఎత్తున స్వయం ఉపాధి పథకాలను అమలుచేసింది. వీటి ద్వారా అనేక మంది బీసీలకు లబ్ధి చేకూరింది. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ల ద్వారా కుల సంఘాలకు నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన గ్రూపులన్నింటికీ నిధులు విడుదల చేయడంలో తీవ్రంగా జాప్యం జరిగింది. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత పెండింగులో ఉన్న యూనిట్లకు సబ్సిడీ సొమ్మును విడుదల చేసింది. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన అదే ఏడాది బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఒక లక్ష, రూ. 50 వేల రూపాయల విలువైన యూనిట్లను నెలకొల్పేందుకు గాను నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 1479 మంది లబ్ధిదారులకు మాత్రమే 50 వేల రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. రెండవసారి కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు ముంచుకు రావడంతో చేతి వృత్తులు చేసుకునే నాయీబ్రాహ్మణ, రజక, సగర, ఉప్పర, కుమ్మరి, అవుసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్రంగి, కృష్ణ బలిజ, పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, మేర 15 కులాలకు చెందిన వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని గత ఏడాది జూన్‌లో ప్రకటించింది. ఆ మేరకు 10,759 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 9,100 మంది అర్హులుగా గుర్తించారు. 962 మంది లబ్ధిదారులకు మాత్రం 9 కోట్ల 62 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమచేసింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ పథకం మూలకు పడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 11కార్పొరేషన్లకు తోడు మరిన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ఇంకా ఎలాంటి పథకాలు ప్రకటించలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా తమ గురించి పట్టించుకోవాలని బీసీలు కోరుతున్నారు.

ఫ మైనార్టీ కార్పొరేషన్‌దీ అదే పరిస్థితి..

మైనార్టీ కార్పొరేషన్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా కొనసాగుతున్నది. దీనిని కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ కార్పొరేషన్‌ను ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖలోనే విలీనం చేశారు. 2015-16 నుంచి చదువుతో పని లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వారికి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 91 యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ మేరకు యూనిట్లను మంజూరు చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 88 లక్షల 80 వేల రూపాయల సబ్సిడీ సొమ్మును విడుదల చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే సబ్సిడీ విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి 135 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. 2018-19లో 11 యూనిట్లు మాత్రమే మంజూరు చేసి గ్రౌండింగ్‌ చేశారు. 2015-16 నుంచి 2018-19 వరకు ఎంపికైన లబ్ధిదారుల్లో పలువురికి నేటికి కూడా సబ్సిడీ రాలేదు. దీంతో వాళ్లు కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయారు. నాలుగు మాసాల క్రితం 54 యూనిట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. కానీ ఇంకా యూనిట్లు గ్రౌండింగ్‌ కాలేదు. ఎన్నికలకు ముందు మైనార్టీల కోసం లక్ష రూపాయల పథకాన్ని ప్రకటించగా, ఆన్‌లైన్‌ ద్వారా 3086 మంది దరఖాస్తు చేసుకోగా, 106 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులను జారీచేశారు. క్రిస్టియన్లు 200 మంది దరఖాస్తు చేసుకోగా, 45 మంది లబ్ధిదారులకు లక్ష చొప్పున మంజూరు చేసినప్పటికీ, నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం స్పందించి ప్రతి ఏటా ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణ ప్రణాళికలు రూపొందించి సబ్సిడీ రుణాలను అందజేయాలని బీసీ, మైనార్టీలు కోరుతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:08 AM