బండి సంజయ్‌దే కరీంనగర్ టికెట్
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:47 AM
భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శనివారం సాయంత్రం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా, అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు తొమ్మిది మంది ఉన్నారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి మళ్లి ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కే అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరి టికెట్ దక్కింది. అధికారికంగా శనివారం వరకు టికెట్ ఎవరికి ఇచ్చేది ప్రకటించకున్నా కరీంనగర్ స్థానంలో తానే పోటీ చేయడం ఖాయమన్న ధీమాతో బండి సంజయ్‌కుమార్ నెల రోజుల క్రితం నుంచే లోక్‌సభకు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతూ వచ్చారు. నియోజక వర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృత పర్యటనలు చేసి పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తు సమావేశాలు నిర్వహించారు. ప్రజాహిత యాత్రను చేపట్టి తొలి విడతలో 119 కిలోమీటర్ల పొడవునా సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల పర్యటనను పూర్తి చేసుకుని ప్రస్తుతం మలివిడత యాత్రలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు పోటీ చేసేందుకు టికెట్ ఆశించి ముమ్మర ప్రయత్నాలు చేసినా చివరకు బండి సంజయ్‌కుమార్ దానిని తిరిగి దక్కించుకున్నారు. 2019లో మొదటిసారి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సంజయ్ 90 వేల ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌పై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించి ఏడాది తిరగక ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలను చేపట్టారు. మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేననే వాతావరణాన్ని తీసుకువచ్చారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలిగిన తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాలలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికే కరీంనగర్ స్థానంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా, ఇప్పుడు బండి సంజయ్‌కుమార్ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకత్వం పేర్కొన్నది. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనుండగా ఇక్కడ ముక్కోణపు పోటీ ఖాయమైంది. ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పనిచేసిన బండి సంజయ్‌కుమార్ కీలక పదవులు చేపట్టారు. యువజన విభాగమైన యువమోర్చాలో కూడా ఆయన చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ అగ్ర నేత ఎల్‌కే ఆడ్వాణీ రథయాత్రలో పాల్గొన్నారు. కరసేవలో సంజయ్ పాల్గొని హిందుత్వ వాదిగా ముద్రపడ్డారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో రెండు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రెండు సార్లు ఓడి పోయారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు పట్ల ప్రజల్లో వ్యక్తమైన సానుకూలత హిందుత్వ వాదిగా పేరుపడ్డ సంజయ్‌కి కలిసి వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన గెలుపొంది జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందన్న ప్రచారం కార్యకర్తలు, నాయకుల్లో ఇప్పటికే జోరందుకోవడంతో ఆ విజయాన్ని ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈటల రాజేందర్‌కు మల్కాజ్‌గిరి
జిల్లాకే చెందిన బీజేపీ నాయకుడు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అగ్రనాయకత్వం మల్కాజ్‌గిరి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజక వర్గం నుంచే కాకుండా గజ్వేల్‌లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి దిగారు. ఈ రెండు స్థానాల్లోను ఆయన ఓడిపోయారు. మల్కాజ్‌గిరి నుంచి పలువురు సీనియర్లు ముఖ్యంగా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మల్క కొమురయ్య పోటీపడ్డా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపింది. బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న సంబంధాల కారణంగా ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించిన నాయకత్వం ప్రస్తుతం లోక్‌సభకు కూడా పోటీకి దింపుతున్నది. జిల్లాకు చెందిన ఇద్దరికి తొలి జాబితాలో చోటు దక్కడంపై బీజేపీ జిల్లా శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఆ పార్టీ నాయకత్వం ఎవరికి అవకాశం కల్పిస్తుందోనన్న చర్చ ప్రస్తుతం ఊపందుకుంటున్నది.