Share News

బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:55 PM

బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, సింగరేణి సంస్థకే కేటాయించాలని లేదంటే పోరా టాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి

సుభాష్‌నగర్‌,జూలై 5: బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, సింగరేణి సంస్థకే కేటాయించాలని లేదంటే పోరా టాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడం అంటే తెలంగాణ తలను నరికివేసి మొండాన్ని మిగిల్చడమేనని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ రామగుండం పర్యటన చేసిన సందర్భంగా సింగరేణిని వేలం వేయమని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ సంపదను దోచుకోవడానికే తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల కేంద్రమంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వినతిపత్రాలకు పరిమితం కాకుండా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, అఖిలపక్ష పార్టీలను ఆహ్వానించి పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , కిషన్‌రెడ్డి వేలంపాటలో స్వయంగా పాల్గొనడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ కంపెనీలకు అమ్ముకొని తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నరేంద్ర మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో బొగ్గు బ్లాక్‌ల రద్దు చేయాలని పోరాడాలని లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. వామపక్ష పార్టీలు అన్ని ట్రేడ్‌ యూనియన్‌లను, ఇతర పార్టీలను కలుపుకొని లోపల పార్లమెంటులో, బయట ప్రత్యక్ష ఆందోళన, పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు మంద పవన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్‌, తెలుగుదేశం నగర అధ్యక్షులు కల్యాడపు ఆగయ్య, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పొన్నగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:55 PM