Share News

పార్లమెంట్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:41 PM

పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియపై తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 19: పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియపై తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టిసారించామని అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 17లక్షల 96వేల మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 50వేల అధికంగా ఉండడం విశేషమని చెప్పారు. 18,19 ఏళ్ల వయసు కలిగిన 46వేల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని అన్నారు. 85 ఏళ్ల పైబడిన వృద్దులు 13,200 మంది ఉన్నారని చెప్పారు. 41,500 మంది దివ్యాంగులు ఉన్నారని, వీరి కోసం ప్రత్యేకంగా వీల్‌ చైర్లును అందుబాటులో ఉంచు తున్నామని చెప్పారు. 8,552 ఈవీఎంలను ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని అన్నారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా పోలింగ్‌ బూత్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చిందని తెలిపారు. అత్యవసర సేవల్లో భాగంగా విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును 12-బి ఫారం ద్వారా వినియోగించుకుంటారని అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని ఖచ్చింగా పాటించాలని, ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పమేలా సత్పతి హెచ్చరించారు. ఎన్నికల నియమావళిపై సీ విజిల్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకు 68 ఫిర్యాదులు రాగా వాటిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సువిధ పోర్టల్‌ ద్వారా సభలు, సమావేశాలు ప్రచారానికి సంబంధించి అనుమతుల కోసం 168 దరఖాస్తులు రాగా 105 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామని, 48 గంటల్లో దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఏదైనా ఫిర్యాదులుంటే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు. పోలీసు తనిఖీల్లో భాగంగా దాదాపు 7 కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మికిరణ్‌, డిఆర్‌వో పవన్‌కుమార్‌, సమాచార పౌరసంబంధాలశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లక్ష్మణ్‌కుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ కొండయ్య, ఏపిఆర్‌వో వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ: కలెక్టర్‌

కరీంనగర్‌ టౌన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ ఓటరు స్లిప్పులను బీఎల్‌ఓలతో పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఓటరు జాబితాను ర్యాండమ్‌గా రాజకీయ పార్టీల నేతలు చెక్‌ చేసుకోవాలన్నారు. పోలింగ్‌ బూత్‌ల పేర్ల మార్పు, స్థల మార్పిడి అదనంగా ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌ల అంశాలపై మాట్లాడారు. ఇంటింటికీ ఓటర్లు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిదులు సిబ్బందితో వెంట ఉండి ఓటరు జాబితాలను చెక్‌ చేసుకోవాలన్నారు. జిల్లాలో బెల్టు షాపులు మూసివేశామని, గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నిబంధనలను ఆయా రాజకీయ పార్టీ నేతలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, డిఆర్‌ఓ పవన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బి శ్రీనివాస్‌, ఆయా రాజకీయ పార్టీల నేతలు సత్తినేని శ్రీనివాస్‌, మడుపు మోహన్‌, కళ్యాడపు ఆగయ్య, వెంకటరమణ, నాంపల్లి శ్రీని వాస్‌, బర్కత్‌ అలీ, మిల్కురి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:41 PM