Share News

రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా?

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:50 AM

రిజర్వేష్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయ కులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు.

రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా?
మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌

- కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సవాల్‌

- ఆ రెండు పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలు

- ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా?

- కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రిజర్వేష్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయ కులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ సవాల్‌ విసిరారు. సోమవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు దమ్ముంటే దేవుడి ఎదుట ప్రమాణం చేద్దాం రండి అంటూ డేట్‌, టైం వేదిక మీరే డిసైడ్‌ చేయాలని సవాల్‌ విసిరారు. నేను అవినీతిపరుడినైతే మీ ఆస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ఆ రెండు పార్టీలు కలిసి విష ప్రచారం చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలు ఒకే స్వరాన్ని వినిపిస్తు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయన్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్త్తుంద న్నారు. ఇదే విషయంపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కూడా ఒప్పించి తీసుకు వస్తానన్నారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అన్నారు. బండి సంజయ్‌ అవినీతి పరుడంటూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. నేను అవినీతికి పాల్పడితే అధికారంలో ఉంది మీరే కదా చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ భూస్థాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్‌ అన్నారు. ప్రజలు ఛీకొట్టినా అహంకారం తగ్గడం లేదన్నారు. తెలంగాణ నినాదంతో కేసీఆర్‌ పార్టీ పెడితే అమెరికాలో ఉండి సిరిసిల్ల వచ్చి కేకే మహేందర్‌రెడ్డి పొట్ట కొట్టిన నీచుడివి నీవు అన్నారు. గాలి మాటలు చెప్పి లిక్కర్‌ దందాలు చేయడం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే కేసీఆర్‌ రైతులకు నయాపైసా ఇవ్వలేదన్నారు. రైతుల పక్షాన, 317 జీవోపై ఉద్యోగుల పక్షాన పోరాటం చేశానన్నారు, నిరుద్యోగుల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానన్నారు. ప్రశ్నించిన నన్ను రాచిరంపాన పెట్టారన్నారు. పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టించారన్నారు. జూన్‌ 4 తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీని పాతాళంలోకి తొక్కబోతున్నారన్నారు. కేటీఆర్‌ అక్రమాస్తులు, అరాచకాల చిట్టాను విప్పుతామన్నారు. నేను వారసత్వ రాజకీయాల చేయలేదని 1994లోనే అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌గా గెలిచానన్నారు. 2005 నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా, 2014, 18లో ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. 2019లో ఎంపీగా పోటీ చేసి 89 వేలకు పైగా మెజారిటీతో గెలిచానన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఒకే స్వరంతో బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెబుతారన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:50 AM