సమీపిస్తున్న గడువు..
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:45 AM
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన గ్రామ, వార్డు సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను శరవేగంగా ఆన్‌లైన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 954 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే నెలలో దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు. గత నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన గ్రామ, వార్డు సభల ద్వారా 2,31,341 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలతో పాటు పలు పథకాలను అమలుచేస్తామని ప్రకటించింది. మహాలక్ష్మి, గృహజ్యోతి. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత గ్యారంటీ పథకాల అమలు కోసం డిసెంబరు 28 నుంచి ఈనెల 6వ తేదీ వరకు 266 గ్రామపంచాయతీల్లో ఒక మున్సిపల్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 114 డివిజన్లు, వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో 1,61,195, పట్టణాల్లో 70,146, మొత్తం 2,31,341 దరఖాస్తులు వచ్చాయి. ఇవేగాకుండా రేషన్ కార్డులు, ఇతరత్రా గ్రామాల్లో 1,92,072, పట్టణాల్లో 77,389 దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయలు వేస్తామని, 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం డిసెంబరు 9వ తేదీ నుంచి అమల్లోకి తీసుకవచ్చింది. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి 15 వేలు, కౌలు రైతులకు 15 వేలు, కూలీలకు 12 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. చేయూత కింద ఇప్పుడు ఇస్తున్న పింఛన్లను డబుల్ చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే నెలలో క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన..
ప్రజల నుంచి గ్రామ, వార్డు సభల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈనెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు 954 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రజాపాలన దరఖాస్తు నమూనాను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాలు ఆన్‌లైన్ అయిన తర్వాత దరఖాస్తుదారుడి సెల్ ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. దాని ఆధారంగా నేరుగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు స్టేటస్‌ను చూసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారు. వచ్చిన మొత్తం దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో స్టేటస్ చూసుకునే అవకాశం కల్పించనున్నారు. ఏయే పథకం ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయం స్థానికంగా తెలియకుండా ఉంది. ఆన్‌లైన్ పూర్తయిన తర్వాత ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది రాష్ట్ర స్థాయిలో సాఫ్ట్‌వేర్‌లో గల ప్రత్యేక ఆప్షన్ల ద్వారా వేరు చేయనున్నారు. ఆ తదనంతరం ఫిబ్రవరి మాసంలో ఆయా పథకాలకు ఎవరు అర్హులు, అనర్హులు ఎవరనే విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని రామగిరి, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు పూర్తయ్యింది. ఈనెల 17వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించగా, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్‌ప్రసాద్‌లాల్ క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతం చేస్తున్నారు.