అంగన్‌వాడీ సిబ్బందిలో ఆందోళన
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:40 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్న వారికి 65 ఏళ్లు నిండితే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాల్సిందేనని, విధుల్లో కొనసాగడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్న వారికి 65 ఏళ్లు నిండితే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాల్సిందేనని, విధుల్లో కొనసాగడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లను గుర్తించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు గత నెల 29వ తేదీన మెమో నంబర్. 1334/ఐసీడీఎస్-1/2024 జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 26 మంది టీచర్లు, 73 మంది హెల్పర్లు ఉన్నట్లు గుర్తించి వారిని విధులకు హాజరుకావొద్దని చెప్పడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో ఆందోళనకు గురవుతున్నారు. పదవీ విరమణ అనంతరం తమకు కల్పించే బెనిఫిట్స్ మొత్తాన్ని పెంచకుండానే హుటాహుటిన తొలగింపు నిర్ణయం తీసుకోవడంతో వాళ్లు హతాశయులయ్యారు. ఏళ్ల తరబడి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చాలీచాలని వేతనాలతో సేవలు అందించిన తమకు గౌరవప్రదంగానైనా పదవీ విరమణ చేసే అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ అనంతరం ఇచ్చే బెనిఫిట్స్ పెంచే విషయాన్ని తేల్చకుండానే పక్కన బెట్టాలనే ప్రభుత్వ చర్యను నిరసిస్తూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పదవీ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు.
జిల్లాలో 706 అంగన్‌వాడీ కేంద్రాలు..
జిల్లాలో 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 664 మంది టీచర్లు, 552 హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నారు. 42 టీచర్ పోస్టులు, 154 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా 65 ఏళ్లు నిండిన వారిలో పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో ఐదుగురు టీచర్లు, 38 మంది హెల్పర్లు, రామగుండం ప్రాజెక్టు పరిధిలో నలుగురు, 13 మంది టీచర్లు, మంథని ప్రాజెక్టు పరిధిలో 17 మంది టీచర్లు, 31 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందారు. దీంతో 68 టీచర్ పోస్టులు, 227 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ లేదు. స్వచ్చందంగా టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ చేస్తే తప్ప పోస్టులు ఖాళీ ఏర్పడేవి కావు. ఈ కేంద్రాల్లో 5 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉంటుంది. బాలింతలు, గర్భిణులకు సైతం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇవేగాకుండా ఇతరత్రా విధులను కూడా అంగన్‌వాడీ టీచర్లకు అప్పగిస్తుంటారు. వీరి పదవీ విరమణకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయస్సును నిర్ధారించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు, కర్ణాటకలో 58 ఏళ్లు, తమిళనాడులో 60 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణను అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా 65 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని గత ఏడాది సెప్టెంబరు 5వ తేదీన బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 10 జారీ చేసింది. అప్పటివరకు పదవీ విరమణ అనంతరం టీచర్లకు 60 వేలు, హెల్పర్లకు 30 వేల రూపాయల బెనిఫిట్స్ కింద ఇచ్చేవాళ్లు.
నెరవేరని హామీలు..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50 పెంచుతూ జీవోలో పేర్కొంది. ఈ జీవో వెలువడిన అనంతరం ఇతర సమస్యలతో పాటు పదవీ విరమణ పొందిన టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు ఒక రూపాయల బెనిఫిట్స్ ఇవ్వాలని 24 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు బెనిఫిట్స్‌ను పెంచుతామని హామీ ఇవ్వడంతో అక్టోబరు 4న సమ్మెను విరమించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో హామీ నెరవేరలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడంతో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్ 7వ తేదీన ఐసీడీఎస్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. డైరెక్టర్ వారితో చర్చలు జరిపి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళతామని చెప్పారని టీచర్లు, హెల్పర్లు చెప్పారు. జూన్ 17న మంత్రి సీతక్క సైతం మహబూబాబాద్ పర్యటనలో టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ అనంతరం ఇచ్చే బెనిఫిట్స్‌ను 2 లక్షలు, ఒక లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినట్లు తెలిపారు. కానీ అవేమి లేకుండానే ఏప్రిల్ 30 వరకు 65 ఏళ్లు నిండిన వారందరినీ తొలగించి, టీచర్లకు ఒక లక్ష, హెల్పర్లకు 50 వేల బెనిఫిట్స్ ఇవ్వాలని అధికారులు సర్క్యూలర్ జారీ చేశారని పేర్కొన్నారు. తమను అవమాన పరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇచ్చే బెనిఫిట్స్‌ను 2 లక్షలు, ఒక లక్షకు పెంచాలని, అప్పటి వరకు తమను విధుల్లో కొనసాగించాలని టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేస్తున్నారు.