Share News

ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:54 AM

తెలంగాణలో కీలక రాజకీయ క్షేత్రంగా భావించే కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

  ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థి

- ప్రచారంలో ముందుకు సాగుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

- గెలుపుధీమాలో మూడు పార్టీలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలంగాణలో కీలక రాజకీయ క్షేత్రంగా భావించే కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ దానిని తిరిగి దక్కించుకోవడానికి సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌లో పాగా వేయడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రాష్ట్ర ఢిల్లీ స్థాయిలో పదేసి సార్లు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశాలు నిర్వహించినా అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో నిర్ణయం తీసుకోలేక పోయింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పలువురు దరఖాస్తులు చేసుకున్నా మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌, రుద్ర సంతోష్‌కుమార్‌ పేర్లను పరిశీలిస్తున్నది. ప్రవీణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించిన ప్రవీణ్‌రెడ్డిని కాదని ఆ స్థానంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు. ఆ సందర్భంలో రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ కేంద్ర నాయకత్వం ప్రవీణ్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కానీ లోక్‌సభ టికెట్‌ కానీ ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఆ మేరకే రేవంత్‌రెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరును ప్రతిపాదించడంతో రాష్ట్ర ఎన్నికల కమిటి ఈ స్థానానికి ఆయన పేరును మాత్రమే కేంద్ర కమిటీకి పంపించింది. అయితే కేంద్ర కమిటీ ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నది. వీరిలో ప్రవీణ్‌రెడ్డికి గానీ రాజేందర్‌రావుకు గానీ అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికిచెందిన వారికి ఇప్పటికే ఆరు స్థానాలను కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీలో రెడ్డి అభ్యర్థులే ఉండడంతో వీరిలో ఒకరికి అవకాశం దక్కవస్తుందని భావిస్తున్నారు. ఖమ్మంలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తే కరీంనగర్‌లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్‌రావుకు, అక్కడ వేరే వారికి అవకాశమిస్తే ప్రవీణ్‌రెడ్డికి టికెట్‌ దక్కవచ్చని భావిస్తున్నారు.

ఫ ప్రచారంలో దూకుడు పెంపిక బీజేపీ, బీఆర్‌ఎస్‌:

కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థి ఎంపికలోనే తేల్చుకోలేక పోతుండగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాత్రమే నామినేషన్లకు ముందే ఒకటిరెండు సార్లు నియోజక వర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి ప్రచారం పూర్తిచేస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ నాయకులు, శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాల పెద్దలను, సంస్థల ప్రతినిధులను, రాజకీయాలను ప్రభావితం చేసే వర్గాలను గుర్తించి వారితో ఇప్పటికే సమావేశాలు, భేటీలు నిర్వహించాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ప్రజాహిత యాత్ర పేరిట నియోజకవర్గంలోని సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, మానకొండూర్‌, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుంటూ గడిచిన టర్మ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా గ్రామాలకు నిధులు, చేపట్టిన పనులు, రాబోయే రోజుల్లో చేపట్టదలచిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తూ వచ్చారు. బీజేపీ కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన విజయసంకల్పసభను జగిత్యాలలో ఏర్పాటు చేయగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ సభలో ప్రసంగించి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని అభ్యర్థిని పరిచయం చేసి గెలిపించాలని కోరారు. ఈ రెండు పార్టీలు ప్రచారంలో అధికార కాంగ్రెస్‌ కంటే ముందుండడం అభ్యర్థి ఎవరో తేలక పోవడం కాంగ్రెస్‌శ్రేణుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నదని చెబుతున్నారు.

ఫ తొలి నుంచి వెలమలదే ఆధిపత్యం :

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి వెలమల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తున్నది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఏర్పడగా 16 సార్లు సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి 15 పర్యాయాలు వెలమ అభ్యర్థులు, మూడు సార్లు బీసీ నాయకులు, ఒకసారి రెడ్డి సామాజిక వర్గం నేతలు, రెండుసార్లు ఎస్సీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీల వారిగా పదిసార్లు కాంగ్రెస్‌, మూడు సార్లు బీజేపీ, నాలుగు సార్లు బీఆర్‌ఎస్‌, టిడిపి, తెలంగాణ ప్రజా సమితి, పిడిఎఫ్‌, ఎన్‌సీఎఫ్‌ ఒక్కోసారి విజయం సాధించాయి.

ఫ బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు పాత కాపులే

ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీపడిన పాత ప్రత్యర్థులే. కాంగ్రెస్‌ నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించినా ఆయన ఈ సారి కొత్తవారే అవుతారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పోటీచేశారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కుమార్‌ గత ఎన్నికల్లో 4,78,916 ఓట్లు పొంది విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థిగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు 4,00,552 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1,76,756 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొంత ఢీలా పడిపోగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీగా సాగింది. ఈసారి కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నాలుగు సెగ్మెంట్లలో ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మరో మూడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెంచుకున్నాయి. అయితే బీజేపీ మాత్రం తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తమకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టింపు ఓట్లు రావడంతో ఈసారి గెలుపు మరింత సులువవుతుందని ఆ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ముక్కోణపు పోరు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 06 , 2024 | 12:54 AM