Share News

చురుకుగా మల్టీపర్పస్‌ పార్కు పనులు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:54 PM

కరీంనగర్‌ నడిబొడ్డున ఏడు ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న మల్టీపర్పస్‌ పార్కు పనులు చురుకుగా సాగుతున్నాయి. 2020 సంవత్సరంలో పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2024 మే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలంటూ ఆర్‌కేఐ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో నగర పాలక సంస్థ ఒప్పందం చేసుకుంది. మొదట్లో కొంత వేగంగానే పనులు జరుగడంతో నిర్ణీత గడువులోగా పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు.

చురుకుగా మల్టీపర్పస్‌ పార్కు పనులు

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 7: కరీంనగర్‌ నడిబొడ్డున ఏడు ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న మల్టీపర్పస్‌ పార్కు పనులు చురుకుగా సాగుతున్నాయి. 2020 సంవత్సరంలో పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2024 మే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలంటూ ఆర్‌కేఐ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో నగర పాలక సంస్థ ఒప్పందం చేసుకుంది. మొదట్లో కొంత వేగంగానే పనులు జరుగడంతో నిర్ణీత గడువులోగా పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత వివిధ సాంకేతిక, ఇతర కారణాలతో పనులను మద్యలోనే నిలిపివేశారు. దీంతో అప్పటికే ఏర్పాటు చేసిన వాటర్‌ పౌంటేన్‌, టైల్స్‌ వంటిలి దెబ్బతిన్నాయి. పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో గతయేడాది పార్కు పనులను పరిశీలించిన మేయర్‌ యాదగిరి సునీల్‌రావు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకుంటే అగ్రిమెంట్‌ రద్దు చేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్టర్‌ సమస్యలను కూడా పరిష్కరించి పనులను వేగంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని ఆదేశించారు. నాలుగైదు నెలలుగా పనుల్లో వేగం పెంచడంతో ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులను జూలై నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై లేదా ఆగస్టులో ప్రజలకు ఈ పార్కును అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

ఫ ఏడెకరాల విస్తీర్ణంలో..

ఏడెకరాల స్థల విస్తీర్ణంలో గల ఈ పార్కులో ఆహ్లాదకరంగా ఉండే చెట్లు, ల్యాండ్‌ స్కేప్‌ వర్క్‌, విద్యుద్దీకరణ పనులు, డ్రిప్‌, స్ర్పింక్లర్ల పనులు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణకు బ్లాక్‌ నిర్మాణ పనులు, ఇతర పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటితోపాటు ఈపీడీఎం ఫ్లోరింగ్‌తో కూడిన వాకింగ్‌ ట్రాక్‌, ఈపీడీఎం ఫ్లోరింగ్‌ చిల్డ్రన్‌ ప్లే ఏరియా పనులు చివరి దశకు చేరుకున్నాయి. సీటింగ్‌, వాకింగ్‌ బారెల్‌, రోటో క్రౌల్‌ ట్యూబ్‌, స్లైడ్‌ రోటో వేవ్‌, కేమల్‌ స్ర్పింగ్‌ రైడర్‌ వంటివి ఏర్పాటు చేశారు. మ్యూజికల్‌ వాటర్‌ పౌంటేన్‌ పనులు ఇంకా ప్రారంభించలేదు.

ఫ నగర వాసులకు ఆహ్లాదం పంచేలా పార్కు అభివృద్ధి

- మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

నగరవాసులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా మల్టీపర్పస్‌ పార్కును తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల కోడ్‌, ఇతరత్రా కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. పనులు 90 శాతం మేరకు పూర్తయ్యాయి, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, మల్టీపర్పస్‌ భవనాన్ని చారిత్రక కట్టడంగా మార్చడం, కేఫటేరియా, ఇతర పనులు మిగిలిపోయాయి. జూలై నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ఆగస్టు మాసంలో పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.

Updated Date - Jun 07 , 2024 | 11:54 PM