Share News

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:42 AM

‘రైతులు కేంద్రాలకు తరలించిన ధాన్యం తూకం వేయకుండా నిద్ర పోతున్నారా? తేమ శాతం వచ్చినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు. దళారులు వచ్చి కేంద్రంలోనేకాంటాలు పెట్టి ధాన్యం తీసుకెళ్తే మీరేం చేస్తున్నారు? రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ హెచ్చరించారు.

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 16: ‘రైతులు కేంద్రాలకు తరలించిన ధాన్యం తూకం వేయకుండా నిద్ర పోతున్నారా? తేమ శాతం వచ్చినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు. దళారులు వచ్చి కేంద్రంలోనేకాంటాలు పెట్టి ధాన్యం తీసుకెళ్తే మీరేం చేస్తున్నారు? రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న జాప్యంపై ‘కేంద్రాల్లో ధాన్యం.. అన్నదాత దైన్యం’ అనే శీర్షికన ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథానికి అదనపు కలెక్టర్‌ స్పందించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, పదిర గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఐరిస్‌ విధానం, ట్యాబ్‌లో నమోదు, కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎందుకు జాప్యం చేస్తున్నారని మండి పడ్డారు. గోనె సంచులు రాక కేంద్రాల్లో అవస్థలు పడుతున్నామని రైతులు పేర్కొనడంతో ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. వెంటనే సంచులు తెప్పించి సాయంత్రంలోగా కొనుగోళ్లను ప్రారంభించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంలో ప్లాస్టిక్‌ సంచుల్లో తూకం వేసిన సంచులను చూసి ఇవెక్కడివని ఆరా తీశారు. దళారులు కాంటా పెట్టి కొనుగోలు చేస్తున్నారని రైతులు, నిర్వాహకులు చెప్పడంతో కేంద్రంలో ఎలా తూకం వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు ఎంత చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. రూ.1800 చెల్లిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర అందిస్తే అంత తక్కువకు ఎందుకు అమ్ముకుంటున్నారన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో గత్యంతరం లేక విక్రయించుకుంటున్నామని వాపోయారు. సంచికి 40.600 కిలోలు తూకం వేయాలని సూచించారు. మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే తమకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో మొత్తం 259 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. 150 కేంద్రాల్లో ధాన్యం సేకరన కొనసాగుతోందన్నారు. మిగతా కేంద్రాలకు రైతులు ఇప్పుడిప్పుడే ధాన్యాన్ని తరలిస్తున్నారని, తేమ శాతం రాకపోవడంతో కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్‌, డీపీఎం సుధారాణి, నాయబ్‌ తహసీల్దార్‌ సత్యనారాయణ, ఏపీఎం శ్రీనివాస్‌ ఉన్నారు.

సిరిసిల్ల రూరల్‌: ధాన్యం కొనుగొళ్లలో వేగం పెంచాలని, కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని చిన్నబోనాల శివారులో రెండో బైపాస్‌ రోడ్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్‌ రకం క్వింటాల్‌ ధ్యాన్యానికి రూ.2203, బీ గ్రేడ్‌ రకానికి రూ. 2183 నిర్ణయించిదని వెల్లడించారు. దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వీర్నపల్లి : రైతులు పంటను దళారులకు విక్రయించ వద్దని అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు భూక్యతండా, బాబాయ్‌ చెరువు తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తూకాన్ని, రిజిస్టర్లను, ట్రక్‌ షీట్లను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్‌ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, డిపిఎం సుధారాణి, అడిషనల్‌ డిఆర్డిఓ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ఎలుసాని ప్రవీణ్‌ కుమార్‌, ఏపీఎం నర్సయ్య, సీసీ శ్యామల ఉన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:42 AM