Share News

‘ఎల్లంపల్లి’ భూముల పరిరక్షణకు చర్యలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:43 AM

ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల పరిరక్షణకు అధికారులు సిద్ధమవుతున్నారు.

‘ఎల్లంపల్లి’ భూముల పరిరక్షణకు చర్యలు

అంతర్గాం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల పరిరక్షణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా చెరువులు ఏర్పాటుచేసిన వ్యక్తులపై చర్యలకు సమాయత్తం అవుతున్నారు. ఇటీవల ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి ఎల్లంపల్లి అధికారులు స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా కొందరు అక్రమార్కులు ప్రాజెక్టును ఆనుకొని ఉన్న భూములను సదరు రైతుల నుంచి లీజుకు తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాజెక్ట్‌ భూముల్లో చెరువులను ఏర్పాటుచేసి చేపల పెంపకం చేపడుతున్నారు. చెరువుల్లో నీటి అవసరాల కోసం ప్రాజెక్ట్‌లో పంప్‌ మోటార్లు ఏర్పరచుకొని నీటిని వాడుకుంటున్నారు. అలాగే సమీపంలోగల ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా అక్రమంగా విద్యుత్తును వినియోగించుకుంటున్నా ఇన్ని రోజులుగా అటు ఎల్లంపల్లి అధికారులు కానీ, విద్యుత్‌ శాఖ అధికారులు కానీ స్పందించకపోవడంపై స్థానిక ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేపల చెరువుల ఏర్పాటుతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం కొలతలపై ప్రభావం చూపనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులను తొలగించి ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యం ఎల్లంపల్లి అధికారులు చెరువుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతర్గాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎల్లంపల్లి ఈఈ స్వామి తెలిపారు. అదేవిధంగా అక్రమంగా విద్యుత్‌ను వాడుకుంటున్న చెరువుల నిర్వాహకులపై చర్యలు తీసుకొని కనెక్షన్‌లు తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులను, ప్రాజెక్ట్‌ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్‌ను శాఖాపరంగా కోరినట్లు ఈఈ స్వామి తెలిపారు.

ప్రాజెక్ట్‌ భూముల కబ్జాపై కఠిన చర్యలు...

- గదరాజు స్వామి, ఈఈ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు

ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలకు సిద్ధమయ్యాం. చేపల చెరువుల ఏర్పాటుకు ప్రాజెక్ట్‌ భూములను కబ్జా చేసిన విషయమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. రెవెన్యూ అధికారులు సహకారంతో ప్రాజెక్ట్‌ భూములకు హద్దులు ఏర్పాటు చేసి ఇకముందు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Dec 31 , 2024 | 12:43 AM