Share News

హుజూరాబాద్‌ డివిజన్‌లో ఇసుక క్వారీల రద్దు

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:34 AM

రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని ఎనిమిది ఇసుక క్వారీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూరాబాద్‌ డివిజన్‌లో ఇసుక క్వారీల రద్దు

- ఎనిమిది క్వారీల్లో తవ్వకాలు నిలిపివేస్తూ ప్రభుత్వ ఆదేశాలు

- ప్రజల ఫిర్యాదుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని ఎనిమిది ఇసుక క్వారీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతి తీసుకుని పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ మానేరు నదిలో నీటి ఊటలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని మానేరు ఇసుక క్వారీల నుంచి స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనుచరులు పెద్ద ఎత్తున ఇసుకను తోడేస్తూ మానేరు నదిపై ఉన్న మూడు చెక్‌ డ్యాంలలో నీరు, నీటి ఊటలు లేకుండా చేస్తున్నారని జమ్మికుంట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, కాంగ్రెస్‌ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి పది రోజుల క్రితం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజల విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆయా క్వారీల నుంచి ఇసుకను తవ్వడాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఇసుక తీయడాన్ని సస్పెండ్‌ చేస్తూ టీఎస్‌ఎండీసీకి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాలను నిలిపివేయడమే కాకుండా ఆయా క్వారీల స్టాక్‌ యార్డుల్లో ఇసుక ఎంత నిల్వ ఉన్నది వివరాలు సమర్పించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లోని జమ్మికుంట, వీణవంక, మానకొండూర్‌ మండలం ఊటూరు గ్రామాల మీదుగా మానేరు నది వెళ్తుంది. ఈ పరిధిలో మూడు చెక్‌ డ్యాంలు కూడా నిర్మించారు. ఈ చెక్‌డ్యాంల కింద ఇసుక మేటలు పేరుకుపోయాయని పేర్కొంటూ టీఎస్‌ఎండీసీ ఆ ఇసుక మేటలను తొలగించేందుకు క్వారీలకు అనుమతి ఇచ్చింది. జమ్మికుంట మండలం వావిలాల, మానకొండూర్‌ మండలం ఊటూరు-1, ఊటూరు-2, వీణవంక మండలం చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోర్కల్‌, పోతిరెడ్డిపల్లి(కల్లుపల్లి) గ్రామాల్లో ఈ మేరకు ఎనిమిది ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి ఇసుకను తవ్వి తీస్తూ అమ్మేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీకి చెందినవారికి ఈ క్వారీలను అప్పగించి అనుమతి మేరకే కాకుండా అక్రమంగా కూడా ఇసుక తరలిస్తున్నారని గతంలోనూ, ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత ఆరోపణలు వచ్చాయి. ఈ క్వారీల పరిధిలోని కొందరు ప్రజలు క్వారీల తవ్వకం కారణంగా మానేరులో నీటి నిల్వలు లేకుండా పోతున్నాయని, దీంతో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కోర్టుకు కూడా వెళ్లారు.

Updated Date - Jan 09 , 2024 | 01:34 AM