Share News

రైతు రుణాల రెన్యూవల్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:31 AM

జిల్లాలోని రైతులు తమ రుణాలను రెన్యూవల్‌ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

రైతు రుణాల రెన్యూవల్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి
రుణ ప్రణాళిక పుస్తకాలను ఆవిష్కరిస్తున్న అరుణశ్రీ, బ్యాంకు అధికారులు

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

పెద్దపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతులు తమ రుణాలను రెన్యూవల్‌ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,854 కోట్ల రూపాయల పంట రుణ లక్ష్యానికి డిసెంబరు చివరి నాటికి 833 కోట్లు, 330 కోట్ల రూపాయల వ్యవసాయ టర్మ్‌ రుణాలకు గాను 491 కోట్ల రుణాలు అందించామని అధికారులు తెలిపారు. పంట రుణాల లక్ష్య సాధనలో 44.92 శాతం మాత్రమే ఉండటంపై అదనపు కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అంశం కారణంగా రైతుల్లో రుణాల రెన్యువల్‌పై అపోహలు తొలగించాలని, క్లస్టర్‌ వారీగా రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ ఇన్‌ఫ్రా కింద ప్రస్తుత సంవత్సరం దాదాపు 50 కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా ఆరు కోట్ల 17 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసి, 12 శాతం లక్ష్యం చేరుకోవడంపై అదనపు కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నాటికి 8,823 స్వశక్తి సంఘాలకు 389 కోట్ల 70 లక్షలు, మెప్మా కింద 341 సంఘాలకు 35 కోట్ల 69 లక్షల బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. నిర్ధేశించిన లక్ష్యాల మేరకు మహిళా సంఘాలకు రుణాలు అందించే విధం గా సంబంధిత అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు తీసుకునే రుణా లతో ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు ప్రణాళి కలు రూపొందించాలని, మహిళా సంఘానికి అందించే రుణాలతో వారు ఏం చేస్తున్నారనే అంశంపై 15 రోజుల్లో నివేదిక అందించాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి స్వానిధి కింద రెండోసారి ఎనిమిది వేల 38 మందికి పంపిణీ చేశామని, ఆర్‌పీలు, బ్యాంకర్లు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పీఎం స్వానిధి రెండో విడత కింద తిరిగి చెల్లించిన వారికి మూడో విడత రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద యువతకు రుణాలు అందించాలని, యువతకు ఉపాధి అందించే విషయంలో అధికా రులు చొరవ చూపాలని, పథకాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అదనపు కలెక్టర్‌ బ్యాంకర్లకు సూచించారు. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పించే దిశగా యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిందని, దీనికోసం వచ్చే ఐదు సంవత్సరాల కాలానికి 13 వేల కోట్లు నిధులను కేటాయించడం జరిగిందని అదనపు కలెక్టర్‌ తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,147 దరఖాస్తులు పీఎం విశ్వకర్మ పథకానికి వచ్చాయని, నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారందరికీ పథకం అమలు అయ్యేవిధంగా చూడాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. అనంతరం 2024-25కు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సీహెచ్‌ వెంకటేశ్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్‌, వివిధ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:31 AM