Share News

అవనిపై విరిసిన హరివిల్లు

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:34 AM

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంకు ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన’’ స్థానిక పార్టనర్‌ మదర్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల, పెద్దపల్లి సహకారంతో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది.

అవనిపై విరిసిన హరివిల్లు
పెద్దపల్లి మార్కెట్‌ యార్డు ఆవరణలో ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు

- ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన

- జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 108 మంది మహిళలు, విద్యార్థినులు

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 6: ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంకు ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగుళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన’’ స్థానిక పార్టనర్‌ మదర్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల, పెద్దపల్లి సహకారంతో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలకు పెద్దపల్లి, గోదావరిఖని, బసంత్‌నగర్‌, యైుటింక్లయిన్‌ కాలనీ, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి, సుల్తానాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి 108 మంది మహిళలు, విద్యార్థినులు హాజరై ఉత్సాహంగా ముగ్గులు వేశారు. ఆకాశంలో పరుచుకునే హరివిల్లు అవనిపై విరిసినట్లుగా.. సంక్రాంతి పండుగ నేపథ్యం.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు, భ్రూణహత్యలను నివారించాలనే సందేశాలతో మహిళలు వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఫ పోటీలు నిర్వహించడం అభినందనీయం..

- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చాలా మంది ముగ్గులు వేసేవారని, ఆ తర్వాత పట్టణాల్లో వేయడం ఆరంభమైందని, ఈతరం అమ్మాయిలకు ముగ్గుల యొక్క ప్రాశస్త్యం గురించి వివరించేందుకు ఆంఽధ్రజ్యోతి ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఇక్కడ వేసిన ముగ్గులు పండుగ నేపథ్యాన్ని వివరించడమే గాకుండా సామాజికంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపే విధంగా మహిళలు ముగ్గులు వేశారన్నారు. ఈ ముగ్గులు సమాజాన్ని ఆలోచింపజేస్తాయన్నారు. మహిళలే గాకుండా యువతులు, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకుండా చేస్తున్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ఎంతో ఓపికతో రెండు గంటల పాటు ముగ్గులు వేయడం సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా చేసిందన్నారు.

ఫ చుక్కల ముగ్గులు సంప్రదాయాలకు నిదర్శనం..

- అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌

చుక్కల ముగ్గులు చక్కటి సంప్రదాయాలకు నిదర్శనమని, ఇందుకు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఇరవై ఏళ్లుగా ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అన్నారు. ఇక్కడికి రాకముందు కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ అవకాశం రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ వేసిన ముగ్గుల్లో చాలా మంది చుక్కల ముగ్గులు వేశారని, అందులో ఈ తరం విద్యార్థినులు కూడా చుక్కల ముగ్గులు వేయడం మంచి పరిణామమని అన్నారు. బహుమతి కోసమని గాకుండా జిల్లా నలుమూలల నుంచి తమ సృజనాత్మకతను చాటుకునేందుకు పోటీకి వచ్చిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జడల సురేందర్‌ మాట్లాడుతూ తమ యార్డు ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించడం వల్ల ఒక కొత్త కళ వచ్చిందని, ప్రతి ఏటా ఇక్కడే నిర్వహించాలని తాము సహాయసహకారాలు అందిస్తామన్నారు. మదర్‌ థెరిస్సా డైరెక్టర్‌ అడవెల్లి నవత మాట్లాడుతూ పండుగ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎల్లవేళలా ఈ పోటీల నిర్వహణకు తమ సహాయసహకారాలు అందిస్తామని అన్నారు.

ఫ మొదటి బహుమతి గెలుచుకున్న సాయిశ్రద్ధ

ఈ పోటీల్లో గోదావరిఖనికి చెందిన సాయిశ్రద్ధ మొదటి బహుమతిని గెలుచుకోగా, రెండవ బహుమతి పెద్దపల్లికి చెందిన సీపెల్లి ఇందు, మూడవ బహుమతి గోదావరిఖనికి చెందిన దుర్గం రేణుకకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌, మదర్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ అడవల్లి నవీన్‌ నగదు బహుమతులను అందజేశారు. అలాగే మరో 20 మందికి కన్సోలేషన్‌ బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ చిరు కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మదర్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ నవత, పెద్దపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జడల సురేందర్‌, మార్కెట్‌ కమిటీ ప్రథమ శ్రేణి కార్యదర్శి ప్రథ్వీరాజ్‌ దేవరాజు, న్యాయనిర్ణేతలు అధ్యాపకురాలు డి అంబిక, అమర్‌నగర్‌ యూపీఎస్‌ ప్రధానోపాధ్యాయురాలు కె మంజులత, ఉపాధ్యాయురాలు డి సంధ్యారాణి, ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ బుర్ర సంపత్‌ కుమార్‌ గౌడ్‌, ఏబీఎన్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ సందెవేన శ్రీనివాస్‌ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు చింతకింద చంద్రమొగిలి, బుర్ర తిరుపతి, మల్యాల శివాచారి, కన్నం చంద్రమౌళి, రామిడి మృత్యుంజయం, ఫొటోజర్నలిస్టు ఎండీ షుకూర్‌, ఏబీఎన్‌ వీడియో జర్నలిస్టు దాడి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:34 AM