Share News

మారుతున్న రాజకీయ సమీకరణాలు

ABN , Publish Date - May 08 , 2024 | 01:10 AM

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నుంచి జంపు జిలానీలు పెరుగుతున్నారు. దీంతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

మారుతున్న రాజకీయ సమీకరణాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నుంచి జంపు జిలానీలు పెరుగుతున్నారు. దీంతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వివిధ పార్టీల నాయకుల చేరికలతో కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ ఉండగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతుండడంతో పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం దెబ్బతింటున్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వర్గ విభేదాలు వెంటాడుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారం ముందుకు సాగడం లేదు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నుంచి కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజెపీ నుంచి గొమాసే శ్రీనివాస్‌ పోటీ పడుతున్నారు. వీరి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నది.. పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా, ప్రస్తుతం జరుగుతున్నది 18వ ఎన్నిక. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పదిసార్లు, తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, బీఆర్‌ఎస్‌ పార్టీ రెండుసార్లు, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ మూడోసారి మాత్రమే పోటీచేస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలవడంతో ఈ ఎన్నికల్లో గెలుపొందడం నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నాయకులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆయన కూడా సింగరేణి కార్మికుడు కావడం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన గురించి వివరిస్తూ ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నప్పటికీ, పార్టీకి చెందిన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కలవరానికి గురవుతున్నారు. బీజేపీకి చెందిన కొందరు నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

ఫ కేడర్‌లో జోష్‌..

కాంగ్రెస్‌ అభ్యర్థి తరపున రాజారంపల్లిలో జన జాతర సభ జరగగా, ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే సీపీఐ, సీపీఎంలు మద్దతు ఇస్తుండడం ఆ పార్టీకి కలిసివస్తున్నది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ పక్షాన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల గోదావరిఖని, మంచిర్యాలలో రోడ్‌ షో నిర్వహించి ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. అయితే అభ్యర్థి తరపున పార్టీ కేడర్‌, కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం చేయడం లేదు. అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్‌ నాయకులను కలుపుకుని వెళ్లకపోవడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీని వీడుతుండడం కలవడానికి గురిచేస్తున్నది. సింగరేణి కార్మికుడిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్‌ ఆ వర్గానికి చెందిన ఓటర్లు తనకు మద్దతుగా నిలుస్తున్నారని ఆశిస్తున్నారు. పదేళ్లలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తనపై ఉన్న సానుభూతి ఎన్నికల్లో విజయ తీరానికి చేరుస్తాయని భావిస్తున్నారు. అయితే గ్రామీణ ఓటర్ల నాడీ మాత్రం బీఆర్‌ఎస్‌కు చిక్కడం లేదు. బీజేపీ అభ్యర్థి తరపున గొమాసే శ్రీనివాస్‌ తరఫున పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. మంగళవారం మంథనిలో జన గర్జన సభా ప్రాంగణంలోని టెంట్లు, కుర్చీలు, కూలర్లు గాలిదుమారంతో కూలిపోయాయి. దీంతో జనం వెళ్లిపోయారు. సభకు రావాల్సిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ ఆలస్యంగా రావడంతో సభ జరగకుండాపోయింది. అక్కడ పార్టీ కార్యకర్తలు, కొద్దిపాటి జనం ఉండడంతో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే పెద్దపల్లి సభతో కొంత ఊపు వచ్చినప్పటికీ, ఆ పార్టీకి పార్లమెంటు పరిధిలో బలమైన కేడర్‌ లేని కారణంగా క్షేత్రస్థాయిలో ఆశించిన దానికంటే ప్రచారం తక్కువే అవుతున్నది. దీనికి తోడు పెద్దపల్లి, రామగుండం తదితర ప్రాంతాల్లో పార్టీలో వర్గ విభేదాలు నెలకొన్నాయి. నేతల మధ్య సమన్వయం కొరవడింది. దింతో అభ్యర్థి శ్రీనివాస్‌ కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేస్తామనే ధీమాను బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటర్లు ఎవరిని విజయ తీరం చేరుస్తారో వేచిచూడాలి.

Updated Date - May 08 , 2024 | 01:10 AM