Share News

ఆందోళనలో అన్నదాత

ABN , Publish Date - May 22 , 2024 | 01:32 AM

భూతల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రతి సీజన్‌లోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం, రవాణా సౌకర్యాన్ని సమకూర్చుకోకపోవడం వంటి సమస్యలకుతోడు అకాల వర్షాలతో అన్నదాతలు అలజడికి గురవుతున్నారు.

ఆందోళనలో అన్నదాత

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

భూతల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రతి సీజన్‌లోనూ రైతులకు కష్టాలు తప్పడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం, రవాణా సౌకర్యాన్ని సమకూర్చుకోకపోవడం వంటి సమస్యలకుతోడు అకాల వర్షాలతో అన్నదాతలు అలజడికి గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా రైతులకు ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. వానాకాలం సీజన్‌ సాగుకు సన్నద్ధం కావాల్సిన రైతులు యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు, వడగళ్ల వానలతో ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో మరింత ఆందోళనలు ఏర్పడ్డాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని తరలించాలంటూ జిల్లాలోని పలు చోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. వివిధ పార్టీల నాయకులు కూడా ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలంటూ ఆందోళనలు, నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు తరుగు పేరిట రైతులకు కోతలు తప్పడం లేదు.

కొనుగోలు లెక్క తప్పింది

జిల్లాలో యాసంగిలో 1.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరిసాగులో గంభీరావుపేటలో 17,318 ఎకరాలు, ఇల్లంతకుంట 25,024, ముస్తాబాద్‌ 19,913, సిరిసిల్ల 4783, తంగళ్లపల్లి 18,851, వీర్నపల్లి 4204, ఎల్లారెడ్డిపేట 16,512, బోయినపల్లి 17,079, చందుర్తి 15,182, కోనరావుపేటలో 17141 ఎ కరాలు, రుద్రంగిలో 4112 ఎకరాలు, వేములవాడలో 5142 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 10487 ఎకరాల్లో సాగు చేశారు. దీని ద్వారా 3.81 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాలు అడుగంటడం, అకాల వర్షాలతో దిగుబడిపై ప్రభావం చూపింది. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ ద్వారా 2.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన 95 కేంద్రాల్లోనే కొనుగోళ్లు పూర్తి చేశారు. 164 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇందులో 44 ఐకేపీ కేంద్రాల ద్వారా 42,631 మెట్రిక్‌ టన్నులు, 202 సింగిల్‌ విండోల ద్వారా 1,68,307 మెట్రిక్‌ టన్నులు, 9 డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా 4886 మెట్రిక్‌ టన్నులు, నాలుగు మెప్మా కేంద్రాల ద్వారా 2872 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. పౌరసరఫరాల శాఖ పెట్టుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితులు లేవు.

రూ.481.79 కోట్ల విలువైన ధాన్యం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 32,857 మంది రైతుల నుంచి 2,18,699 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం విలువ 481.79 కోట్లు ఉంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 31,165 మంది రైతుల ధాన్యానికి సంబంధించిన వివరాలు పొందుపర్చారు. 31,417 మంది రైతులకు 1,75,980 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.387.68 కోట్లు చెల్లించారు.

Updated Date - May 22 , 2024 | 01:32 AM