Share News

రాజన్న ఆలయాభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:11 AM

వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గతంలో హెచ్‌ఎండీఏ సాఫ్ట్‌ లోన్‌ ద్వారా మంజూరై నిలిచిన రూ.20 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రాజన్న ఆలయాభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు
సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- వేములవాడ వీటీడీఏ పనులపై పవర్‌ ప్రజంటేషన్‌., సమీక్ష

సిరిసిల్ల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గతంలో హెచ్‌ఎండీఏ సాఫ్ట్‌ లోన్‌ ద్వారా మంజూరై నిలిచిన రూ.20 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న పనులపై పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వీటీడీఏ వైస్‌ చైర్మన్‌ అనురాగ్‌ జయంతి ముఖ్యమంత్రికి వివరించారు. దేవస్థానం అభివృద్ధి, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి నమూనాలను, పార్కింగ్‌ స్థలంలో టూరిజం శాఖ చేపడుతున్న పనులను వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నిలిచిపోయిన నిధులు రూ 20 కోట్లను విడుదల చేయాలని అదేశిస్తూ బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన మండప నిర్మాణం, గుడిచెరువు సుందరీకరణ, నటరాజ విగ్రహం ఏర్పాటతోపాటు పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధితోపాటు టూరిజం శాఖ పనుల్లో వేగం పెరగాలన్నారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేలా మూలవాగు బ్రిడ్జితో పాటు బ్రిడ్జి నుంచి 800 మీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. రోడ్ల విస్తరణతోపాటు మూలవాగు బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన రూ.35 కోట్లు నిధులు త్వరలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గుడిచెరువులోకి వివిధ కాలువల ద్వారా మురికి నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నూతన కాలువల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మురుగు కాలువల నిర్మాణానికి ఎస్టీఎఫ్‌ నిధుల విడుదల చేయాలని, మురుగు నీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేయాలని అన్నారు. గుడిచెరువు విస్తీర్ణం, పార్కింగ్‌ స్థలాల వివరాలను సీఎం తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిషోర్‌, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ గౌతమి, దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, వేములవాడ దేవస్థానం ఈవో కృష్ణప్రసాద్‌, వేములవాడ కమిషనర్‌ అవినాష్‌ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి రాజన్న ప్రసాదం

హైదరాబాద్‌లో వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, రాజరాజేశ్వరస్వామి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. మురికి నీటి కాలువల నిర్మాణానికి ఎస్టీఎఫ్‌ నిధులు మంజూరు చేసి వీటీడీఏ సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 12:11 AM