Share News

వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:12 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాఽధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతోంది. ఈ విద్యాసంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది.

 వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాఽధించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతోంది. ఈ విద్యాసంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. గత విద్యా సంవత్సరం 2023 - 24లో 98.27 శాతంతో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి ప్రథమ స్థానంలో నిలిచేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. డిసెంబరులో సిలబస్‌ పూర్తయిన తరువాత ఉదయం 8 గంటల నుంచి 9 వరకు తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో అల్పాహారం విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. గతంలో అల్పాహారం అందించడానికి ప్రభుత్వంతోపాటు దాతలు కూడా ముందుకు వచ్చే వారు. ఈ సారి ప్రభుత్వం అల్పాహారంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి పాఠశాల పూర్తయిన 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు ఉంటున్నారు. తిరిగి ఇంటికి వెళ్లే వరకు భోజనం చేయని పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అల్పాహారం విషయంలో దాతల సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి, మండల కేంద్రాలకు వచ్చే పదోతరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతుల కోసం ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరాల్సి ఉంటుంది. దీంతో సరైన పౌష్టికాహారం అందక ఏకాగ్రత విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు

జిల్లాలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మోడల్‌, కేజీబీవీ పాఠశాలలకు సంబంధించి పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 6918 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3186 మంది, బాలికలు 3732 మంది ఉన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 3045 మంది విద్యార్థులు ఉండగా బాలురు 1685 మంది, బాలికలు 1368 మంది, మోడల్‌ స్కూల్‌లలో 593 మంది ఉండగా బాలురు 287 మంది, బాలికలు 306 మంది, మైనార్టీ వెల్ఫేర్‌ పాఠశాలలో 74 మంది ఉండగా బాలురు 29 మంది, బాలికలు 45 మంది, బీసీ రెసిడెన్షియల్‌లో 264 మంది ఉండగా బాలురు 122 మంది, బాలికలు 142 మంది, ఏకలవ్య రెసిడెన్షియల్‌లో 106 మంది బాలురు 41 మంది, బాలికలు 65 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 143 మంది ఉండగా బాలికలు 143 మంది, సోషల్‌ వెల్ఫేర్‌లో 520 మంది ఉండగా బాలురు 153 మంది, బాలికలు 367 మంది, కేజీబీవీలో 508 మంది, తెలంగాణ రెసిడెన్షియల్‌లో 74 మంది బాలురు ఒక్కరు, బాలికలు 73 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 117 మందిలో బాలురు 67 మంది, బాలికలు 50 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1466 మంది బాలురు 798 మంది, బాలికలు 668 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిది మంది ఉన్నారు.

జిల్లాలో మెరుగైన ఫలితాలు

జిల్లాలో పది వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 6470 మంది పరీక్షలకు హాజరవగా 6358 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. ఈసారి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రణాళికతో విద్యాశాఖ ముందుకెళ్తోంది.

Updated Date - Nov 28 , 2024 | 01:12 AM