Janagana: చిందు యక్షగానానికి గుర్తింపు
ABN , Publish Date - Jan 26 , 2024 | 10:36 AM
గడ్డం సమ్మయ్య ఐదు దశాబ్దాలుగా చిందు యక్షగాన కళకు దివిటీ పట్టారు. ఆయనది జనగామ జిల్లా. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. రామస్వామి, చండిగాంబ దంపతులకు 1958లో జన్మించారు.
- ఐదు దశాబ్దాలుగా కళకు గడ్డం సమ్మయ్య దివిటీ
జనగామ, (ఆంధ్రజ్యోతి): గడ్డం సమ్మయ్య ఐదు దశాబ్దాలుగా చిందు యక్షగాన కళకు దివిటీ పట్టారు. ఆయనది జనగామ జిల్లా. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. రామస్వామి, చండిగాంబ దంపతులకు 1958లో జన్మించారు. ఆ తర్వాత రామస్వామి దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడ్డారు. సమ్మయ్య ఆరో తరగతి దాకా చదివారు. సమ్మయ్య తమ కులవృత్తి అయిన చిందు యక్షగాన ప్రదర్శనల్లో పాల్గొనేవారు. 16ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రితో కలిసి చిన్ని కృష్ణుడి వేషధారణలో కళారంగ ప్రవేశం చేశారు. జాంబవపురాణం, భాగవతం, రామాయణం వంటి కథలను ప్రదర్శనల రూపంలో చెప్పడమే చిందు యక్షగానం. చిన్ననాటి నుంచి ఈ కళపై మక్కువతో 5 దశాబ్దాలుగా 19వేల ప్రదర్శనలు ఇచ్చారు. సమ్మయ్య లోహితాంకుడు, ప్రహ్లాదుడు, సిరియాలుడు, బాలవద్దిరాజు పాత్రల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చేవారు. సత్యహరిశ్చంద్ర, కీచక, కంసుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, రావణబ్రహ్మ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోతారు. గడ్డం సమ్మయ్యకు వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన ముత్తిలింగం కుమార్తె శ్రీరంజినితో 1983లో వివాహం జరిగింది. సమ్మయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు సోమరాజు చిందు కళలోనే ఉన్నారు. సమ్మయ్య 1991లో ఆలిండియా రేడియాలో 80 ప్రదర్శనలు, దూరదర్శన్‌లో 90 ప్రదర్శనలిచ్చారు. సాంస్కృతిక, పర్యాటక శాఖలో సుమారు 4000 ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా ఢిల్లీ, ఒడిసా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు.