Share News

బలమైన విపక్షం ఉండాలి

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:23 AM

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.....

బలమైన విపక్షం ఉండాలి

అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం

అంతులేని హామీలతో కాంగ్రెస్‌ గెలిచింది

నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతాం

నోరు మూసుకోను.. పోరాడతా

రాష్ట్రంలో మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులు

తాగునీటి, కరెంట్‌ కష్టాలు వచ్చాయి

సర్కారుకు చిత్తశుద్ధి, నైపుణ్యం లేకనే..

రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పతనమైంది?

పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు?

హామీలపై కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

మతం మత్తులో ఓటేస్తే పిచ్చోళ్లను చేస్తారు

చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని, అప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతులేని హామీలు, ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రె్‌సకే ఓటువేస్తే.. ‘మేము పంగనామాలు పెట్టినా మళ్లీ మాకే ఓటు వేస్తున్నారు’ అని వారు అనుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నెరవేర్చాలంటే ప్రజలు ఓటుతో చురుకు పెట్టాలని సూచించారు. హామీల అమలు కోసం ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడతామని అన్నారు. శనివారం చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. గెలిచిన ప్రభుత్వం ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటూ ధీమా కల్పించాలి. వారి ఆత్మవిశ్వాసం, గౌరవం పెంచేదిగా పాలించాలి. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే బాధ కలుగుతోంది. కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి అయిదు నెలలవుతున్నా ఇప్పటివరకు హామీలను నెరవేర్చలేదు. ఒక్క పాలసీనీ అమలు చేయలేదు’’ అని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కరెంట్‌, తాగునీరు బ్రహ్మాండంగా ఇచ్చామన్నారు. ‘‘కేసీఆర్‌ పక్కకు పోగానే కరెంట్‌ ఎందుకు మాయమైంది? దానికి ఏం రోగమొచ్చింది? తాగే నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీ అసమర్థత వల్ల కాదా? గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కొనసాగించినా సరిపోయేది. వాటిని కూడా నడపలేని అసమర్థ ప్రభుత్వం ఇది’’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చిత్త శుద్ధి, కార్యాచరణ లేవని, ఉన్న వసతులు, వనరులను వాడుకునే నైపుణ్యం కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో పదేళ్ల కిందట ఉన్న పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని, చావు నోట్లో తలపెట్టి సాధించిన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయని, ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నీటి కోసం ఈ ఇబ్బందులు ఎందుకు?

తాము 24 గంటలపాటు కరెంట్‌ ఇచ్చి, అన్ని ప్రాంతాలకు పుష్కలంగా తాగునీరు అందించామని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు నీటి కోసం, కరెంట్‌ కోసం ప్రజలు ఇబ్బందులు ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. దళితబంధు కింద తాము రూ.10 లక్షలు ఇస్తే.. కాంగ్రెస్‌ రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క బిడ్డకు కూడా దళిత బంధు, బీసీ బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పైగా, ఈ పథకాల కింద తమ ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్రీజ్‌ చేసి డబ్బు మొత్తాన్ని వాపస్‌ తీసుకుందని ఆరోపించారు. దళిత బంధు కింద తాము 1.3 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన డబ్బును వారికి ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు వారందరినీ తీసుకువచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హామీలు అమలు చేస్తారా? లేదా? అని కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలన్నారు. ‘‘పోరాటం చేయకుండా ఏమీ రాదు. మీ అందరికీ బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది. మౌనం వహించకుండా సమయం వచ్చినప్పుడు పోరాటం చేయాలి. ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఒక వేటగాడు కావాలని, పదునైన మొనదేలిన అంకుశం, అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ లాంటి నేతలు కావాలని పేర్కొన్నారు.

బతికి ఉన్నంతకాలం పోరాడతా

బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం, తెంగాణ ప్రయోజనాల కోసం అని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు అధికారం ఇస్తే అన్ని వర్గాల వారినీ పదేళ్లపాటు ఆదుకున్నామని, కోడి తన పిల్లలను రెక్కల కింద పెట్టుకుని కాపాడినట్లు తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని కాపాడిందని తెలిపారు. ఇపుడు తన కళ్లముందే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, రైతులు గోస పడుతుంటే బాధ కలుగుతోందన్నారు. ‘‘నేను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తాను తప్ప.. నోరు మూసుకుని కూర్చోను. రాష్ట్ర పభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ధాన్యం వచ్చింది.. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసినా.. గింజ లేకుండా కొనాలి. రైతులకు న్యాయం చేయాలి’’ అని అన్నారు. బీసీలకు దమ్ము, పౌరుషం ఉంటే కాసానిని గెలిపించి చూపించాలని ఒక పెద్ద మనిషి అన్నారని, బలహీనవర్గాల వారు ఈ సవాల్‌ను స్వీకరించి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని కోరారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న రంజిత్‌రెడ్డిపై కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పుణ్యాన గెలిచిన రంజిత్‌రెడ్డికి తాము ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. ‘‘ఇక్కడ బీజేపీ, కాంగ్రె్‌సల తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులూ ఎవరికీ తెలిసినవారు కాదు. మా పార్టీ నుంచే ఎంపీలయ్యారు. రంజిత్‌రెడ్డి ఏ కారణంతో బీఆర్‌ఎస్‌ నుంచి పోయాడు?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పి దెబ్బకొట్టాలన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పతనమైంది?

కాంగ్రెస్‌ ఇచ్చిన 420 వాగ్దానాలు ఏమయ్యాయని కేసీఆర్‌ నిలదీశారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వడం లేదు కానీ.. రాష్ట్రంలో లూటీలు మాత్రం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో గతంలో భూముల ధరలు ఎలా ఉండేవి? ఇపుడు ఎక్కడ ఉన్నాయని, రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. దీని వెనుక బ్రోకర్లు, జోకర్లు ఎవరున్నారని, రియల్‌ ఎస్టేట్‌ పర్మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. లక్షల మంది పిల్లలు బతికే రియల్‌ ఎస్టేట్‌ నాశనమైందని, ఇంకా ఇలాగే చూస్తూ కూర్చుందామా? ప్రభుత్వానికి బుద్ధి చెబుదామా? అని ప్రశ్నించారు. బీజేపీ భావోద్వేగాలు పెంచడం తప్ప.. ప్రజలకు ఏ మేలూ చేయలేదని కేసీఆర్‌ అన్నారు. మోదీ హయాంలో పెట్రోల్‌ ధరలు పెంచడం తప్ప.. ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. బీజేపీ వల్ల తెలంగాణకు ఒక్క మంచి పని జరగలేదన్నారు. ‘‘అయితే మోడీ.. లేదంటే ఈడీ. ఇదేనా బీజేపీ రాజకీయం? దండం పెట్టి చెబుతున్నా.. బీజేపీ భావోద్వేగాలు పెంచితే మతం మత్తులో పడి వారికి ఓటేస్తే తరువాత మనం పిచ్చిలేసి పోతాం తప్ప.. మనకు ఉద్యోగాలు రావు.’ అని కేసీఆర్‌ చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టమన్న బీజేపీని ఎన్నికల్లో నేలకేసి కొట్టాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు కేసీఆర్‌ నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటు అంబేద్కర్‌ పుణ్యమేనని, ఆయన రచించిన రాజ్యాంగం స్ఫూర్తితోనే రాష్ట్రం సాధించామని చెప్పారు.

Updated Date - Apr 14 , 2024 | 03:23 AM