మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా?
ABN , Publish Date - Jun 12 , 2024 | 05:03 AM
మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు..? మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా..? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి.. ఎన్ని రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. శుద్ధమైన నీరు అందుతుందా..? అంటూ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది.

మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా?
ఎన్నిరోజులకోసారొస్తాయి.. నీళ్లు సరిపోతున్నాయా?
తాగునీటిపై గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయిస్తున్న సర్కారు
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు..? మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా..? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి.. ఎన్ని రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. శుద్ధమైన నీరు అందుతుందా..? అంటూ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది. కుటుంబానికి సరిపోయే నీటిని అందించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నం చేసినా.. చాలాచోట్ల నీరు రావడం లేదు.
వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పథకం నిర్వహిస్తున్నా.. ప్రజల అవసరాలు తీర్చడం లేదని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో రక్షేతస్థాయి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సోమవారం ప్రారంభమైన ఈ సర్వే.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. పది రోజుల్లోపు ఈ సర్వేను పూర్తిచేయాలని సంబంధిత విభాగాలు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వే బృందాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. సర్వే పూర్తి వివరాలను అందులో పొందుపర్చనున్నారు.
సర్వే సాగుతోందిలా..!
ఇంటి యజమాని పేరు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉందా? నీటి సరఫరా సక్రమంగా జరుగుతోందా? కుటుంబం మొత్తానికి నీళ్లు సరిపోతున్నాయా అనే వివరాలు సర్వేలో సేకరిస్తున్నారు. అలాగే ఇంటి ఫొటోతోపాటు, మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన నల్లా, సంపును సైతం సర్వే సిబ్బంది ఫొటోలు తీస్తున్నారు. అదేవిధంగా భగీరథ స్కీమ్‌కు సంబంధించిన వివరాలతోపాటు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మహిళలు, పురుషులు ఎంతమంది? కులం, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. అనంతరం లబ్ధిదారుడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని యాప్‌లో ఎంటర్ చేసిన తర్వాతనే ఆ వివరాలు అప్‌డేట్ అవుతాయి. కాగా, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం కింద ట్యాంకులు నిర్మించి.. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన జల్ జీవన్ మిషన్‌ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ పథకం నిర్మాణం, అమలులో లోపాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మిషన్ భగీరథను కేంద్రం పరిధిలోని జల్‌జీవన్ మిషన్ కార్యక్రమంతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తున్నందున సర్వే అనంతరం రాష్ట్రానికి అవసరమైన రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, ట్యాంకులు, పైప్ లైన్లు, మోటార్ల ఏర్పాటు ఇతర వనరుల కోసం కేంద్రానికి నివేదిక పంపనుంది.