Share News

Telangana : లారీ వాలాల్లా వెళ్లి..

ABN , Publish Date - May 29 , 2024 | 06:31 AM

అది రవాణాశాఖ కార్యాలయం.. ఇద్దరు వ్యక్తులు చేతుల్లో ఏవో కాగితాలు పట్టుకుని వచ్చారు. వారి ఆహార్యం, వేషధారణను బట్టి ఎవరైనా లారీ డ్రైవరో.. ఆటోవాలానో అనుకుంటారు.

Telangana : లారీ వాలాల్లా వెళ్లి..

  • ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

  • రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు

  • కస్టమర్లలా ఏసీబీ డెకాయ్‌ ఆపరేషన్‌.. 2.7 లక్షల నగదు స్వాధీనం

  • డాక్యుమెంట్లలో నకిలీ బీమా పత్రాలు.. అదుపులో ఏజెంట్లు.. విచారణ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): అది రవాణాశాఖ కార్యాలయం.. ఇద్దరు వ్యక్తులు చేతుల్లో ఏవో కాగితాలు పట్టుకుని వచ్చారు. వారి ఆహార్యం, వేషధారణను బట్టి ఎవరైనా లారీ డ్రైవరో.. ఆటోవాలానో అనుకుంటారు. కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లారు. ‘‘పనేంటి?’’ అని అడిగారు. దాంతో వారు ‘‘లారీ పర్మిట్‌ కోసం వచ్చాం’’ అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తులు తమనుతాము ఆర్టీయే ఏజెంట్లుగా పరిచయం చేసుకుని, ‘‘వెంటనే పనవ్వాలంటే ఇంత పైకం ఇవ్వాల్సిందే..!’’ అని చెప్పారు. ‘‘సరే..’’ అని చెప్పడంతో వారిని క్యూలైన్‌ ద్వారా కాకుండా, నేరుగా ఆర్టీవో కార్యాలయంలోని ఓ గుమస్తా వద్దకు తీసుకెళ్లారు. ఆ ఏజెంట్లు అప్పటికే తమ చేతిలో ఉన్న కొన్ని ఫైళ్లను గుమస్తా ముందు పెట్టారు.

ఆ ఫైళ్లలో నగదు ఉంది. అంతే.. లారీ డ్రైవర్‌, ఆటోవాలాలా వచ్చిన వ్యక్తులు తాము ఏసీబీ అధికారులమని చెబుతూ.. ఆ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. లెక్కపత్రాలు, నగదు మొత్తాన్ని లెక్కించారు. రెండిటి మధ్య తేడాలు ఉండడంతో.. ఏజెంట్ల ద్వారా అక్రమాలు జోరుగా సాగుతున్నాయని గుర్తించారు. ఇలా.. మంగళవారం ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 9 రవాణాశాఖ కార్యాలయాలు, 3 సరిహద్దు చెక్‌పోస్టులపై డెకాయ్‌ ఆపరేషన్ల ద్వారా మెరుపుదాడులు చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌, పర్మిట్ల జారీ.. ఇలా పలు పనులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిపినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌(ఈస్ట్‌జోన్‌), బండ్లగూడ(సౌత్‌జోన్‌), టోలిచౌకి(వె్‌స్టజోన్‌), రంగారెడ్డి జిల్లా ఆర్టీవో(మణికొండ), కరీంనగర్‌, నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కార్యాలయాలతోపాటు.. నిజామాబాద్‌ జిల్లా సాలూర, ఆదిలాబాద్‌లోని భోరాజ్‌, ఖమ్మంలోని అశ్వారావుపేట్‌ చెక్‌పోస్టుల్లో లారీ డ్రైవర్లు, ఆటోవాలాల మాదిరిగా డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి, సోదాలు జరిపారు. ఆర్టీఏ నగదు చెల్లింపు సేవలన్నీ ఆన్‌లైన్‌లోకి మారినా.. ఆయా కార్యాలయాల్లో నగదు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల జరిపిన తనిఖీల్లో రూ.2.7లక్షల నగదును సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఏజెంట్లతో అంటకాగిన కొందరు ఉద్యోగులు, ఇతర సిబ్బందిని విచారించారు. ఓ దశలో ఏజెంట్లు ‘‘మేము సొంత పనులపై వచ్చాం సార్‌.. మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం’’ అని అనడంతో.. వారి వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకుని, పరిశీలించారు. ‘‘మీ పత్రాలే అయితే.. మీ పేర్లు ఎందుకు లేవు?’’ అని నిలదీశారు. ఈ క్రమంలో కొన్ని వాహన పత్రాల్లో నకిలీ ఇన్సూరెన్స్‌ కాపీలు ఉన్నట్లు గుర్తించారు. 12 చోట్ల డీఎస్పీ స్థాయి ఏసీబీ అధికారుల నేతృత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడులపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు మీడియాకు వివరించారు.


చెక్‌పోస్టుల వద్ద ‘ప్రైవేటు’ హవా!

ఆర్టీయే చెక్‌పోస్టుల వద్ద పలు డాక్యుమెంట్లను అధికారులు సీజ్‌ చేశారు. అతిపెద్ద చెక్‌పో్‌స్టగా పేరున్నభోరాజ్‌(ఆదిలాబాద్‌) చెక్‌పోస్టు వద్ద మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) చేయాల్సిన పనులన్నీ ప్రైవేటు వ్యక్తులు పూర్తిచేస్తుండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. చెక్‌పోస్టుల వద్ద లారీ డ్రైవర్లు చెల్లించినట్లుగా రవాణాశాఖ సిబ్బంది పేర్కొన్న నగదును, రసీదులను పరిశీలించారు. రికార్డుల్లో లేని డబ్బు కూడా ఉన్నట్లు గుర్తించి, సీజ్‌ చేశారు. అధికారుల మాదిరిగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కాగా, ఆర్టీవో కార్యాలయాల్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏకకాలంలో ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ సారి ఇదే స్థాయిలో ఏసీబీ దాడులు జరిగాయి.

ప్రభుత్వం ఓడీలను రద్దు చేసినా..

రేవంత్‌ సర్కారు అధికారంలోకి రాగానే.. రవాణాశాఖలో అక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కీలక స్థానాల్లో ఇన్‌చార్జులుగా కొందరే అధికారులు పనిచేస్తున్నట్లు గుర్తించింది. ఓ కీలకమైన ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే అధికారికే.. ముఖ్యమైన చెక్‌పోస్టు లేదా మరో జిల్లా బాధ్యతలు(ఓడీ) అప్పగించారని, దానివల్ల ప్రతిభావంతులకు స్థానంలేక.. రవాణాశాఖలో అవినీతి రాజ్యమేలుతోందని నిర్ధారించుకుంది. ఆర్టీవో స్థాయి అధికారి నుంచి ఏఎంవీఐ, జవాన్‌ దాకా అందరికీ ఓడీలను రద్దు చేసింది. భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. అయినా.. రవాణా శాఖ సేవలకు సంబంధించి ఫిర్యాదులు వస్తుండడంతో.. మంగళవారం ఏసీబీ దాడులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

  • డబ్బులే డబ్బులు..!

  • మలక్‌పేట్‌ కార్యాలయంలో దాడుల సందర్భంగా.. అటకపై ఓ పర్సు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. అందులోని రూ.22 వేలను సీజ్‌ చేశారు

  • అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద లారీ వాలాల నుంచి అనధికారికంగా వసూలు చేసిన రూ.35 వేల నగదు పట్టుబడింది

  • మహబూబ్‌నగర్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో రమేశ్‌ అనే వ్యక్తి లైసెన్స్‌ కోసం వచ్చేవారికి ఒక్కో టెస్టుకు తన కారును రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తూ.. అద్దెకు ఇస్తున్నాడని ఏసీబీ గుర్తించింది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెప్పారు

  • సిద్దిపేట ఆర్టీయే కార్యాలయంలో స్లాట్‌ బుక్‌ అయిన సేవలకు సంబంధించిన మొత్తం ఫైళ్లలో 75ు ఏజెంట్ల చేతుల్లో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది

  • నల్లగొండ ఆర్టీవో కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్ల వద్ద 60 ఫైళ్లు, రూ.12,500 నగదును సీజ్‌ చేశారు

  • ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద రసీదుల్లో లెక్కల కంటే అదనంగా ఉన్న రూ.11 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Updated Date - May 29 , 2024 | 06:37 AM