Share News

Hyderabad-Indigo: దసరా హాలిడేస్‌లో టూర్‌ ప్లాన్ చేస్తున్నారా.. మీకో గుడ్‌న్యూస్

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:36 PM

హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్న ఎయిర్ ఫ్యాసింజర్లకు దేశీయ విమాన దిగ్గజం ఇండిగో ఎయిర్‌లైన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి పలు నగరాలకు కొత్త డైరెక్ట్ ఫ్లైట్‌లను ప్రకటించింది.

Hyderabad-Indigo: దసరా హాలిడేస్‌లో టూర్‌ ప్లాన్ చేస్తున్నారా.. మీకో గుడ్‌న్యూస్
Indigo

హైదరాబాద్: దసరా వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు దాదాపు 10 రోజులు సెలవులు వస్తాయి. దీంతో విద్యార్థులతో పాటు ఇంట్లోని పెద్దలు కూడా టూర్‌ ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలకు వెళ్లాలనుకునే తెలుగువారికి దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో గుడ్‌న్యూస్ చెెప్పింది. హైదరాబాద్ నుంచి పలు నగరాలకు ఇటీవలే కొత్త డైరెక్ట్ ఫ్లైట్‌లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్, ఆగ్రాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టింది. మొత్తం ఆరు గమ్య స్థానాలకు విమానాలు ప్రకటించగా జాబితాలో ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌తో పాటు అగర్తల, కాన్పూర్, జమ్మూ, అయోధ్య కూడా ఉన్నాయి.


హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌కి డైరెక్ట్ విమానాలు సెప్టెంబర్ 28న ప్రారంభమయ్యాయి. వారానికి మూడు సార్లు సర్వీసులు నడుస్తాయి. ఆర్‌జీఐఏ నుంచి ఉదయం 8:55 గంటలకు బయలుదేరే విమానం 10:50 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కి చేరుకుంటుంది.

హైదరాబాద్ నుంచి ఆగ్రా: హైదరాబాద్-ఆగ్రా మార్గం కూడా సెప్టెంబర్ 28న ప్రారంభమయింది. వారానికి మూడు సర్వీసులు ఉంటాయి. ఈ విమానాలు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు ఆగ్రా చేరుకుంటాయి. చారిత్రాత్మకమైన తాజ్ మహల్‌ సందర్శకులు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.

హైదరాబాద్ నుంచి కాన్పూర్: కాన్పూర్‌కి విమానాలు సెప్టెంబర్ 27న మొదలయ్యాయి. వారానికి నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. విమానం హైదరాబాద్‌లో ఉదయం 8:55 గంటలకు బయలుదేరి 11:00 గంటలకు కాన్పూర్ చేరుకుంటుంది.

హైదరాబాద్ నుంచి అయోధ్య: ఈ సర్వీసును వారానికి నాలుగుసార్లు నడపనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు అయోధ్యకు చేరుకుంటాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసులు లభిస్తాయి.


హైదరాబాద్ నుంచి అగర్తలా: హైదరాబాద్-అగర్తల మార్గం సెప్టెంబర్ 23న సర్వీసులు మొదలయ్యాయి. వారానికి నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. విమానాలు ఉదయం 7:30 గంటలకు ఇక్కడ 10:20 గంటలకు అగర్తల చేరుకుంటాయి.

హైదరాబాద్ నుంచి జమ్మూ: ఇండిగో సెప్టెంబర్ 24న జమ్మూకి విమాన సర్వీసును ప్రారంభించింది. వారానికి మూడు సార్లు ఈ విమాన సర్వీసు ఉంటుంది. హైదరాబాద్‌లో ఉదయం 7:05 గంటలకు బయలుదేరి 10:10 గంటలకు జమ్మూ చేరుకుంటుంది.

హైదరాబాద్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంలో భాగంగా ఇండిగో ఈ మేరకు సర్వీసులను ప్రవేశపెట్టింది.

Updated Date - Sep 29 , 2024 | 05:09 PM