Share News

హెల్త్‌ సెక్రటరీపై మంత్రికి ఫిర్యాదు

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:52 AM

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి(హెల్త్‌ సెక్రటరీ) క్రిస్టినా జడ్‌ చోంగ్ధుపై ఆ శాఖలోని ఓ విభాగాధిపతి(హెచ్‌వోడీ) వైద్య మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేశారు. ఏకంగా హెల్త్‌ సెక్రటరీపైనే విభాగాధిపతిఫిర్యాదు చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. బ్లడ్‌బ్యాంకుల పనితీరు, వాటిల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు.

హెల్త్‌ సెక్రటరీపై మంత్రికి ఫిర్యాదు

  • తనను అవమానించారని ఓ విభాగాధిపతి ఆవేదన

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి(హెల్త్‌ సెక్రటరీ) క్రిస్టినా జడ్‌ చోంగ్ధుపై ఆ శాఖలోని ఓ విభాగాధిపతి(హెచ్‌వోడీ) వైద్య మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేశారు. ఏకంగా హెల్త్‌ సెక్రటరీపైనే విభాగాధిపతిఫిర్యాదు చేయడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. బ్లడ్‌బ్యాంకుల పనితీరు, వాటిల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గురువారం సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ముందు ఆరోగ్య శాఖలో పలు విభాగాల అధిపతులు హెల్త్‌ సెక్రటరీని కలిశారు. ఈ క్రమంలో బ్లడ్‌బ్యాంకుల పని తీరు గురించి ఆమె అడిగారు. తన వద్ద బ్లడ్‌ బ్యాంకుల సమాచారం ఏదీ లేదని సదరు విభాగాధిపతి తెలియజేశారు.

దాంతో సెక్రటరీ అసహనానికి గురయ్యారు. కనీస సమాచారం లేకుండా సమీక్షకు ఎలా హాజరవుతారని మండిపడ్డారు. సమీక్ష సమావేశంలో ఉండాల్సిన అవసరం లేదని బయటకు పంపారు. ఈ తతంగమంతా జరుగుతోన్న సమయంలో హెల్త్‌ సెక్రటరీ కార్యాలయ అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నారు. దాంతో అవమానంగా భావించిన సదరు విభాగాధిపతి ఆగ్రహంగా బయటకు వెళ్లిపోయారు. తర్వాత నేరుగా మంత్రి దామోదర ఛాంబర్‌కు వెళ్లారు. జరిగిన విషయాన్ని మంత్రికి వివరించి, సెక్రటరీపై ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే అకారణంగా తనను అవమానించారని చెప్పినట్లు తెలిసింది.

అనంతరం బ్లడ్‌ బ్యాంకులపై సమీక్షకు హాజరవకుండానే ఆయన సచివాలయం నుంచి వెనక్కు వెళ్లిపోయారు. ఆ విభాగాధిపతి లేకుండానే మంత్రి బ్లడ్‌ బ్యాంకులపై సమీక్ష కూడా జరిపారు. సమీక్షకు సంబంధించిన సబ్జెక్టు ఏంటో ముందస్తు సమాచారం ఇవ్వకుండా హడావుడిగా రమ్మన్నారని, అలా అయితే ఎలా సిద్ధమవుతామని సదరు విభాగాధిపతి తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. కాగా సదరు విభాగాధిపతికితన విభాగానికి సంబంధించిన విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదని, ముందే సమాచారం ఇచ్చినా సరైన సమాచారంతో రారని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jun 15 , 2024 | 07:05 AM