Share News

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:53 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్‌(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్‌ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!
CBI Arrests Kavitha

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam Case) అరెస్టై.. తిహాడ్‌(Tihar) జైల్లో ఉన్న కవితను(Kavitha) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)(CBI) అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు(Anil) తెలిపింది. ఆమె అరెస్టును సవాల్‌ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని(Rouse Avenue Court) ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం 4.55 నిమిషాలకు ఆ పిటిషన్‌.. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ ముందుకు వచ్చింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది నితేశ్‌ రాణా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆమెను అరెస్టు చేసే క్రమంలో సీబీఐ కనీస ప్రమాణాలు పాటించలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా.. సీబీఐ వాటిని పాటించలేదని తెలిపారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి మనోజ్‌కుమార్‌.. ‘పిటిషన్‌పై వాదనలు వినాలా? వద్దా?’ అనే దానిపై ఇంకా నిర్ణయమే జరగలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారమూ లేదని తెలిపారు. ‘‘మీకేమైనా సమాచారం ఉందా?’’ అని సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనకూ ఎలాంటి

సమాచారం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో.. అసలు సీబీఐ అరెస్టు చేసిందని మీరెలా చెబుతున్నారని కవిత తరఫు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. కవితను అరెస్టు చేసినట్టు ఆమె భర్త అనిల్‌కు సీబీఐ సమాచారం అందించిందని మోహిత్‌ రావు తెలిపారు. అయితే.. అత్యవసర కేసులను మాత్రమే తాము విచారిస్తామని, కాబట్టి ఈ విషయంలో కవితకు ఎటువంటి ఊరట ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు. దీనిపై గతంలో ఎప్పుడూ మా దగ్గర వాదనలు జరగలేదు. ఈరోజు సెలవు కదా? అత్యవసరమైన కేసులను మాత్రమే విచారిస్తాం. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏమైనా అత్యవసర ఆదేశాలు ఇస్తే అమలుచేస్తాం. అయినా.. ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదనేది మా అభిప్రాయం. కాబట్టి ఈ కేసులో ఎలాంటి ఊరటా ఇవ్వలేం.’’ అని తేల్చిచెప్పారు. దీంతో.. తమ పిటిషన్‌ను రెగ్యులర్‌ కోర్టులో శుక్రవారమైనా విచారించాలని మోహిత రావు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌.. ఈ కేసుపై రెగ్యులర్‌గా విచారణ జరుగుతున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా కోర్టులోనే శుక్రవారం ఉదయం 10 గంటలకు వాదనలు వినిపించాలని సూచించారు. పిటిషన్‌ను ఆ న్యాయస్థానానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు.

మొదట సాక్షిగా.. తర్వాత నిందితురాలిగా...

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను తొలుత విచారించింది సీబీఐ అధికారులే. ఆ తర్వాతే ఈడీ రంగంలోకి దిగింది. కవితకు సీబీఐ 2022 డిసెంబరు 2న నోటీసులు పంపింది. డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లోనే ఆమెను తొలిసారి విచారించింది. అప్పుడు కవితను సాక్షిగా మాత్రమే సీబీఐ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న.. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ చార్టిషీట్‌ దాఖలు చేసింది. 26న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు రాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసింది. 16న ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. తర్వాత 10 రోజులపాటు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. 26న న్యాయస్థానం కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆమెను తిహాడ్‌ జైలుకు తరలించారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం ఈ నెల 9న మరో 14 రోజులపాటు పొడిగించింది. కవిత 17 రోజులుగా తిహాడ్‌ జైలులోనే ఉన్నారు.

శనివారమే కవితను విచారించిన సీబీఐ...

తిహాడ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నదని, అందుకే తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే.. జైలులో విచారించేందుకే న్యాయస్థానం అనుమతిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ కవిత ఈ నెల 6న రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే ఎలా అనుమతి ఇస్తారని కవిత తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అందుకు తమకు మూడురోజుల సమయం కావాలని సీబీఐ కోరడంతో కేసు విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. బుధవారం విచారణ సందర్భంగా.. కవితను ఇప్పటికే విచారించేశామని కాబట్టి కౌంటర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కవిత తరపున న్యాయవాదులు కోరడంతో 26న మధ్యాహ్నం 12 గంటలకు వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే.. గత శనివారం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుండగానే తిహాడ్‌ జైలుకు వెళ్లి కవితను సీబీఐ విచారించింది. తాజాగా ఆమెను అరెస్టు చేసింది. శుక్రవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను సీబీఐ హాజరుపరిచి.. కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరనున్నట్టు సమాచారం.

కోర్టు ఆదేశాలను సీబీఐ పాటించలేదు..

కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా కవితను సీబీఐ అరెస్టు చేసిందని ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా జైలులో అరెస్టు చేశారు. జైలులో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాలంటే ముందుగానే కోర్టు అనుమతి తీసుకోవాలి. వారెంట్‌ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇవేమీ పాటించకుండా కవితను సీబీఐ అరెస్టు చేసింది. అందుకే ఆ కాపీ ఇవ్వమని మేం కోరాం. ఈ రోజు కోర్టుకు సెలవు కావడంతో డ్యూటీ జడ్జి ముందు విచారణకు వచ్చింది. అయితే.. ఈ కేసు విచారణ జరుగుతున్న న్యాయస్థానం ముందే శుక్రవారం ఉదయం 10 గంటలకు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు. కవితను శుక్రవారం కోర్టులో ప్రవేశపెడతారని తెలిసింది. మాకు తెలియకుండానే అరెస్టు చేయడం సరికాదు. కేసు విచారణలో ఉండగా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు ఎలా చేస్తారు? మొదటిసారి కూడా మాకు సమాచారం ఇవ్వకుండానే తిహాడ్‌ జైలుకు వెళ్లి విచారించారు. దీనిపై మేం కోర్టును ఆశ్రయించాం. ఆ విచారణ ఈ నెల 26వ తేదీన ఉంది. అది పెండింగ్‌లో ఉండగానే మళ్లీ అరెస్టు చేశారు. కవితను విచారించాలి అనుకుంటే ముందుగానే సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అయినప్పటికీ అవేమీ పాటించలేదు.‘ అని మోహిత్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 08:54 AM