Share News

Hyderabad: పేషెంట్లు లేకుండానే ప్రిస్ర్కిప్షన్లు.. అనుమతులు లేకుండా మత్తు ఇంజెక్షన్లు

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:04 PM

ఆసిఫ్‏నగర్‌లోని సమీర ఆస్పత్రిలో పేషెంట్లు లేకుండానే ప్రమాదకరమైన, అధిక మత్తునిచ్చే మందుల ప్రిస్ర్కిప్షన్లు రాస్తున్న విషయం శనివారం వెలుగు చూసింది.

Hyderabad: పేషెంట్లు లేకుండానే ప్రిస్ర్కిప్షన్లు.. అనుమతులు లేకుండా మత్తు ఇంజెక్షన్లు

- రూ.57 ఇంజక్షన్‌ రూ.5 వేలకు విక్రయం

- సమీర్‌ హాస్పిటల్‌లో అధికారుల తనిఖీ

- చైర్మన్‌, డైరెక్టర్‌ సహా.. ఐదుగురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఆసిఫ్‏నగర్‌లోని సమీర ఆస్పత్రిలో పేషెంట్లు లేకుండానే ప్రమాదకరమైన, అధిక మత్తునిచ్చే మందుల ప్రిస్ర్కిప్షన్లు రాస్తున్న విషయం శనివారం వెలుగు చూసింది. తెలంగాణ నార్కొటిక్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు రెండు రోజుల క్రితం ఆసి్‌ఫనగర్‌లోని అనస్తీషియా డాక్టర్‌ అశన్‌ ముస్తాఫా ఖాన్‌ ఇంటిపై దాడిచేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నార్కోటిక్‌ పోలీసులు.. డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(Drug Control Administration) అధికారులతో కలిసి డాక్టర్‌ ఆశన్‌ముస్తఫాఖాన్‌ పనిచేస్తున్న సమీర్‌ హాస్పిటల్‌పై శనివారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ పాత తేదీలతో (22-12-2023) సర్జికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ షేక్‌ సలీమ్‌ రాసిన ప్రిస్ర్కిప్షిన్‌తో కూడిన మందుల చీటీలను పోలీసులు గుర్తించారు. శ్వాసకోశ, హెచ్‌ఐవీ, టీబీయా బోన్‌ ఫ్యాక్చర్‌, హెర్నియా, హిస్టరెక్టమీ తదితర బాధితులకు వినియోగించడానికి 100 ఫెంటానిల్‌ ఇంజక్షన్లు డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌లో రాసినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 17 ఇంజక్షన్లు ఆస్పత్రి యాజమాన్యం వినియోగించినట్లు రిజిస్టర్‌లో రాశారు. కానీ, అందుకు సంబంధించిన పేషెంట్ల వివరాలు మాత్రం లభించకపోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 6న అనస్తీషియా డాక్టర్‌ ఆశన్‌ ముస్తఫాఖాన్‌ భార్యకు మరో 100 ఇంజక్షన్లు అందినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే 43 విక్రయించగా.. 57 ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు ఇంజక్షన్ల ధర కేవలం రూ.57 మాత్రమే. అయితే, వాటిని డ్రగ్స్‌ వినియోగదారులకు రూ.ఐదు వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఎన్డీపీఎస్‌ అనుమతులు లేకుండా..

అధిక మత్తును కలిగించే ఫెంటానీల్‌ సిట్రేట్‌ ఇంజక్షన్లు ఆస్పత్రిలో పేషెంట్లకు వినియోగించాలంటే ఆ ఆస్పత్రికి ఎన్డీపీఎస్‌ లైసెన్స్‌-2 అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే మత్తు ఇంజక్షన్లు వినియోగిస్తున్నట్లు నార్కోటిక్‌, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు. వీటిని మెడికేర్‌ ఫార్మా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఎన్టీపీఎస్‌ లైసెన్స్‌-1 అనుమతులు ఉండాలి. కానీ, మెడికేర్‌ ఫార్మాకు అలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిని అక్రమంగా వినియోగిస్తున్న సమీర్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ సోయబ్‌ సుభానీ, డైరెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌, ఫార్మాసిస్టు సయ్యద్‌ నజీరుద్దీన్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మహ్మద్‌ జాఫర్‌, మెడికేర్‌ ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌ గోపు శ్రీనివా్‌సలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:04 PM