Share News

Hyderabad: ఎస్‌ఐబీలో ఏకచ్ఛత్రాధిపత్యం.. ఎనిమిదేళ్లుగా తిష్టవేసిన ప్రణీత్‌రావు

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:25 AM

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు(Former DSP Praneet Rao).. గత ఎనిమిదేళ్లుగా ఒకేచోట తిష్టవేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు.

Hyderabad: ఎస్‌ఐబీలో ఏకచ్ఛత్రాధిపత్యం.. ఎనిమిదేళ్లుగా తిష్టవేసిన ప్రణీత్‌రావు

- ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ అయ్యే వరకు అక్కడే

- అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా విధులు..

- చెప్పిన పని చెప్పినట్లు చేసిన ప్రణీత్‌రావు

- ప్రభుత్వం మారడంతో కుట్రకోణం వెలుగులోకి

- రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు

హైదరాబాద్‌ సిటీ: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు(Former DSP Praneet Rao).. గత ఎనిమిదేళ్లుగా ఒకేచోట తిష్టవేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో 2016లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన ప్రణీత్‌రావు పై అధికారులు, కొంతమంది ప్రజా ప్రతినిధులకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ ఏకచ్ఛత్రాధిపత్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు పొందుపరిచారు. ఫోన్‌ట్యాపింగ్‌ మాత్రమే కాకుండా.. నమ్మక ద్రోహం, అధికార దుర్వినియోగం, ఆధారాలు మాయం చేయడం వంటి మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు.

ఎస్‌ఐబీ అడిషనల్‌ ఎస్పీ డి. రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు ఇటీవల పలు కేసులు నమోదు చేశారు. ప్రణీత్‌రావు 2016లో ఎస్‌ఐబీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా చేరి 2023లో అగ్జిలరేటరీ పద్ధతిలో డీఎస్పీగా పదోన్నతి పొందేంత వరకు అక్కడే తిష్టవేసినట్లు గుర్తించారు. ఎస్‌ఐబీలో రెండు గదులను ప్రత్యేకంగా కేటాయించుకొని వాటిలో 17 కంప్యూటర్‌లను ఏర్పాటు చేశాడు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అధికారులకు అందజేసేవాడు. అంతేకాకుండా ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన సొంత హార్డ్‌ డిస్కుల్లో కాపీ చేసుకునే వాడు. గతేడాది డిసెంబర్‌-3న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత గత ప్రభుత్వం ఓటమి పాలవడంతో హుటాహుటిన 2023 డిసెంబర్‌ 4న ప్రణీత్‌ కుమార్‌ సీసీటీవీ కెమెరాలను ఆపివేసి, ఏళ్ల తరబడి హార్డ్‌ డ్రైవ్స్‌లో ఉన్న డాటాను ధ్వంసం చేసి, వాటి స్థానంలో కొత్త హార్డ్‌ డ్రైవ్‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. పోలీసులు ప్రణీత్‌ కుమార్‌పై పలుసెక్షన్‌లతోపాటు ఐటీ యాక్ట్‌లు ప్రయోగించి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌బీ వర్టికల్‌ విభాగానికి బదిలీ అయిన ప్రణీత్‌రావును జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో పంజాగుట్ట

ఇన్‌స్పెక్టర్‌ బి. శోభన్‌, ఎస్‌ఐ పి.ప్రదీప్‌ బృందం ఈనెల 12న రార.తి 10:30కు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రణీత్‌ రావు నుంచి పోలీసులు ఒక లాప్‌టాప్‌, మూడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అప్పటికే సేకరించి పెట్టుకున్న సమాచారంతో ప్రశ్నించగా, ప్రణీత్‌రావు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి కొవిడ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. ప్రణీత్‌రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరికి అప్పగించారు. కాగా.. ఆయన టీమ్‌లో ఇన్‌స్పెక్టర్లు శోభన్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, కె.ఎం రాఘవేంద్ర, శ్రీనివాసులు ఉన్నట్లు వెల్లడించారు.

పోలీసుల వద్ద ట్యాపింగ్‌ ఫోన్‌నంబర్‌ల జాబితా..

ఇదిలా ఉండగా.. ప్రణీత్‌రావు ట్యాపింగ్‌ చేసిన వందలాది ఫోన్‌ నంబర్ల జాబితాను పోలీసులు ఇప్పటికే బయటకు తీసినట్లు తెలిసింది. అయితే వాటిలో ఎంతమంది ప్రజా ప్రతినిధుల నంబర్లు ఉన్నాయి..? ఉన్నతాధికారులు ఎంతమంది..? మీడియా సంస్థల (ప్రతినిధులు) ఫోన్‌ నంబర్లు ఎన్ని..? వ్యాపారస్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు ఎంతమంది.? అనేది విశదీకరించే పనిలో ప్రత్యేక టీమ్‌ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అప్పటి ఎస్‌ఐబీ ఉన్నతాధికారులు పోషించిన పాత్రపైనా పోలీసులు సమాచారాన్ని రాబట్టారు. ప్రణీత్‌రావును మరోసారి పోలీస్‌ కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారించి మిగిలిన అధికారుల పాత్రపైనా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుట్రకోణంలో పోలీసులు వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒక ఉన్నతాధికారి ఇప్పటికే విదేశాలకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. మిగిలిన వారి కదలికలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Updated Date - Mar 16 , 2024 | 10:25 AM