Share News

Hyderabad: కో..కో..కోడి.. నగరంలో కొండెక్కిన చికెన్‌ ధరలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:32 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్‌ రేట్లు పెరిగాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్కిన్‌లె్‌స కిలో రూ.180 నుంచి రూ.200, లైవ్‌ కోడి రూ.120 నుంచి రూ.160 విక్రయించారు. ఇటీవల పెరిగిన

Hyderabad: కో..కో..కోడి..  నగరంలో కొండెక్కిన చికెన్‌ ధరలు

- స్కిన్‌లెస్‌ కిలో రూ.260 నుంచి 280

- లైవ్‌ బర్డ్‌ కిలో రూ.160 నుంచి 180

- రూ.450 వరకు పలుకుతున్న నాటుకోడి

- ఎండల నేపథ్యంలో తగ్గిన కోళ్ల దిగుమతులు

నగరంలో చికెన్‌ ధర దడ పుట్టిస్తోంది. 15 రోజుల్లో కిలోకు రూ.100 నుంచి 120 వరకు పెరగడంతో చికెన్‌ప్రియులు ఆందోళన చెందుతున్నారు. కొనేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్‌ రేట్లు పెరిగాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్కిన్‌లె్‌స కిలో రూ.180 నుంచి రూ.200, లైవ్‌ కోడి రూ.120 నుంచి రూ.160 విక్రయించారు. ఇటీవల పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతి భారీగా తగ్గింది. ఈనేపథ్యంలో డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

జనవరిలో కొనుగోలు చేసిన పిల్లలే..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ సుమారు 10వేల టన్నుల చికెన్‌ను విక్రయిస్తుంటారని అంచనా. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్‌ పండుగల సమయంలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు అమ్ముతుంటారు. నగరంలో పేరొందిన హోల్‌సేల్‌ వ్యాపారులతో పాటు చిన్న చిన్న దుకాణాదారులు వారం, పదిరోజులకు సరిపడా కోళ్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తుంటారు. ఏటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు.. ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం కావడంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. దీంతోపాటు, ఏపీలో కోళ్లు చనిపోతుండడం వల్ల అక్కడి వ్యాపారులు హైదరాబాద్‌, శంషాబాద్‌, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, తదితర ప్రాంతాల్లోని ఫౌల్ర్టీఫారాల నుంచి కోళ్లను ఎగుమతి చేసుకుంటుండడంతో నగరంలో కొరత ఏర్పడుతోంది. నగరంలోని చాలా చికెన్‌ సెంటర్లలో ప్రస్తుతం జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటివారంలో కొనుగోలు చేసిన కోడి పిల్లలే ఉన్నాయి. డిమాండ్‌ ఉన్నందున వాటికే రేట్లు పెంచి అమ్ముతున్నారు.

భారీగా తగ్గిన అమ్మకాలు..

పెరిగిన ధరలతో నగరంలో చికెన్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి. సాధారణ రోజులతో పోల్చితే నాలుగు రోజులుగా 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో సగటున 12 వేల టన్నుల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరల కారణంగా నిన్న ఆదివారం నగరంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో కలిపి 6వేల టన్నుల వరకే అమ్మకాలు జరిగినట్లు తెలిసింది. కిలో లైవ్‌ కోడి ధర కూడా రూ.180 వరకు పలుకుతుండడంతో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. నాటుకోడి ధర రూ.380 నుంచి రూ.450 ఉండడంతో చాలామంది దానిఊసే ఎత్తడం లేదు. చికెన్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో కొందరు మేక మాంసం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోళ్ల దిగుమతి పెరిగి, ఎండలు తగ్గిన తర్వాతే ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:51 PM