Share News

Hyderabad: కోచ్‌.. తూచ్‌..! మెట్రో రైళ్లల్లో అదనపు బోగీలు కరువు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:23 AM

నగరంలోని ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌(LBnagar-Miyapur, JBS-MGBS), నాగోలు- రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల ద్వారా రోజుకు 1,028 సర్వీసులను నడిపిస్తున్నారు.

Hyderabad: కోచ్‌.. తూచ్‌..! మెట్రో రైళ్లల్లో అదనపు బోగీలు కరువు

- పెంచుతామని హామీ.. పట్టించుకోని అధికారులు

- రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులు

- ఉదయం, సాయంత్రం వేళల్లో కాలు పెట్టలేని పరిస్థితి

- 3 నుంచి 6 నిమిషాలకు పెరిగిన సమయం

మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో బోగీల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో బోగీలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉంటున్నారు. అదనపు బోగీలు పెంచుతామని కొన్ని నెలల క్రితం హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎల్‌బీనగర్‌- మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌(LBnagar-Miyapur, JBS-MGBS), నాగోలు- రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల ద్వారా రోజుకు 1,028 సర్వీసులను నడిపిస్తున్నారు. రోజుకు 4.80 లక్షల నుంచి 5.10 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండడంతో ఎల్‌అండ్‌టీకి తగిన ఆదాయం సమకూరుతోంది. 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు మూడు కారిడార్లలో రికార్డుస్థాయిలో 1.09 కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు అప్పట్లో ఎల్‌అండ్‌టీ వర్గాలు వెల్లడించాయి.

బోగీల పెంపు ఎక్కడ..

నగరంలో ట్రాఫిక్‌ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆటోలు, బస్సులతో పోల్చితే నిమిషాల వ్యవధిలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉండడంతో చాలామంది మెట్రోకే మొగ్గుచూపుతున్నారు. అయితే, గతేడాది జనవరి నుంచి రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైలులోని మూడు బోగీలు కిక్కిరిసి వెళ్తుండడంతోపాటు మహిళలకు కేటాయించిన అరబోగీలోకి కూడా పురుషులు చొచ్చుకు వెళ్తుండడంతో వారు అసహనానికి లోనవుతున్నారు. ప్రధానంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు బోగీల్లో నిలబడే పరిస్థితి ఉంటుంది. దీంతో మెట్రోలో అదనపు బోగీలు పెంచడంపై గత ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లలో ఉన్న 171 కోచ్‌లకు అదనంగా మరో 40 నుంచి 50 కోచ్‌లను తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో నాగ్‌పూర్‌ నుంచి కోచ్‌లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినా అమలుకు నోచుకోవడం లేదు.

సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తులు..

అదనపు బోగీలను పెంచాలని కోరుతూ కొన్ని నెలలుగా ప్రయాణికులు ప్రభుత్వానికి, మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోని పరిస్థితి. స్టేషన్లలోని ప్లాట్‌ఫారంలపై 6 బోగీలు నిలిపే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ముందు వరకు 3 నిమిషాలకు ఒక రైలును నడిపించి వేగవంతమైన ప్రయాణాన్ని అందించిన అధికారులు ఏడాది కాలంగా వేళలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3 నిమిషాలకు ఉన్న రైలు సమయం కాస్తా 6 నిమిషాలకు పెరగడంతో ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, నాగోలు, బేగంపేట్‌, అమీర్‌పేట్‌, పెద్దమ్మ గుడి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, మియాపూర్‌ లాంటి స్టేషన్లలో ఎప్పుడు చూసినా రద్దీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అదనపు బోగీల పెంపుపై ప్రత్యేక చొరవ చూపి, మెరుగైన ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు. అలాగే రైళ్ల సమయాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:23 AM