Share News

Hyderabad: బంజారా భాషలో భగవద్గీత

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:55 AM

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు కేతావత్‌ సోమ్లాల్‌. 16నెలల పాటు అవిశ్రాంత కృషి చేసి భగవద్గీతలోని 701శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు.

Hyderabad: బంజారా భాషలో భగవద్గీత

- 701 శ్లోకాలను అనువదించిన సోమ్లాల్‌

హైదరాబాద్: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించారు కేతావత్‌ సోమ్లాల్‌. 16నెలల పాటు అవిశ్రాంత కృషి చేసి భగవద్గీతలోని 701శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి(Bhuvanagiri) మండలం ఆకుతోటబావి తండా సోమ్లాల్‌ స్వస్థలం. నంద్యాలోని ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. సాహిత్యాభిలాషి అయిన సోమ్లాల్‌ 200కు పైగా పాటలు రాశారు. తండాల్లో తిరుగుతూ పాటలు పాడుతూ గిరిజనులను చైతన్యం చేస్తున్నారు. 1998 ఆగస్టు 8వ తేదీన భగవద్గీత అనువాదం మొదలుపెట్టి దాదాపు 16నెలల కృషితో పూర్తి చేశారు. భగవద్గీత అనువాదం 1989 పూర్తయినా అది అచ్చవ్వడానికి 25ఏళ్లు పట్టింది. 2014లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పటి సుప్రీంక్రోర్టు చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దుత్తు, జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌ ఆవిష్కరించారు. ద హిస్టరీ ఆఫ్‌ బంజారా, భారత్‌ బంజారా గీతమాల, తొలి వెలుగు వంటి రచనలు చేసిన సోమ్లాల్‌ గిరిజన యూనివర్శిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సోమ్లాల్‌కు ఆరుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నాదమ్ములు. పేదరికం కమ్మేసినా తాత, మేనమామ ప్రోత్సాహంతో ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకున్నారు. ఆయన పదో తరగతి చదువుతూ జనగాంలోని హాస్టల్‌ ఉండేవారు. పక్కనే గీతామందిరం ఉండటంతో ప్రతిరోజు ఉదయం లౌడ్‌ స్పీకర్‌లో వినిపించే గీతను విని అభిమానం పెంచుకున్నారు. గీతా సారాన్ని గిరిజనులకు అందించాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.

Updated Date - Jan 26 , 2024 | 10:55 AM