Share News

High Court: జనవరి 9 వరకూ హరీశ్‌ను అరెస్టు చేయొద్దు

ABN , Publish Date - Dec 31 , 2024 | 03:42 AM

మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్‌ చేయరాదని ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 9 వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

High Court: జనవరి 9 వరకూ హరీశ్‌ను అరెస్టు చేయొద్దు

  • ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మధ్యంత ఉత్తర్వుల పొడిగింపు

  • క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్‌ చేయరాదని ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 9 వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ఎస్‌ఐబీ అధికారులు ట్యాప్‌ చేశారన్న చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు డిసెంబరు 3న కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసును కొట్టేయాలంటూ హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై డిసెంబరు 5న విచారణ జరగ్గా.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేయరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


తాజాగా ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లక్ష్మణ్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. హరీశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రామచంద్రరావు వాదిస్తూ రాజకీయ కక్షతోనే చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. హరీశ్‌రావుపై వచ్చిన ఆరోపణల స్వభావం తీవ్రమైనదని, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం ద్వారా స్వేచ్ఛ, గోప్యత హక్కులను హరించారని విమర్శించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. హరీశ్‌రావును అరెస్ట్‌ చేయరాదని, కేసును దర్యాప్తు చేసుకోవచ్చని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.

Updated Date - Dec 31 , 2024 | 03:42 AM