Share News

Midday Meal: ‘మధ్యాహ్న భోజనం’ ధరల పెంపు

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:33 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మఽ ద్యాహ్న భోజన పథకం ధరలను పెంచారు. స్కూల్‌ స్థాయిని బట్టి 74 పైసల నుంచి రూ.1.12కు వరకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలను రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నారు.

Midday Meal: ‘మధ్యాహ్న భోజనం’ ధరల పెంపు

  • ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.6.19

  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.9.29

  • 74 పైసల నుంచి రూ.1.12 పెంచిన కేంద్రం

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మఽ ద్యాహ్న భోజన పథకం ధరలను పెంచారు. స్కూల్‌ స్థాయిని బట్టి 74 పైసల నుంచి రూ.1.12కు వరకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలను రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నారు. ఇందుకయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.5.45, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.8.17 చొప్పున చెల్తిస్తున్నారు. ఈ ధరలను రూ.6.19కి, రూ.9.29కి పెంచాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో 74 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.1.12 చొప్పున పెంచారు. పెంచిన ధరలను డిసెంబరు 1 నుంచి అమలు చేయనున్నారు.


మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అన్నం-కూర, అన్నం-ఆకు కూర పప్పు, వెజిటబుల్‌ బిర్యానీ వంటి వాటిని అందిస్తున్నారు. దీంతో పాటు వారానికి మూడు సార్లు కోడి గుడ్డును కూడా ఇస్తున్నారు. గుడ్డు కోసం అదనంగా రూ.5 చెల్లిస్తున్నారు. ఈ పథకానికి అవసరమయ్యే బియ్యాన్ని కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, ఇతర వంట సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి రూ.5.45, రూ.8.17 చొప్పున చెల్లిస్తున్నారు. ఇవి సరిపోవడం లేదంటూ ఎప్పటి నుంచో మధ్యాహ్న భోజన వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలను పెంచారు. పెంచిన ధరల ప్రకారం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పాఠశాలల్లో పర్వాలేదు కానీ, సంఖ్య తక్కువగా ఉంటే.. ఇబ్బందికర పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య 50లోపు ఉన్న స్కూళ్లలో ప్రభుత్వం చెల్లించే ధరలు సరిపోవనే వాదన ఉంది.


  • గుడ్డు ధరలు చాలట్లే..

విద్యార్థులకు భోజనంలో ఇస్తున్న గుడ్డుకు చెల్లిస్తున్న ధరలు మార్కెట్‌ ప్రకారం లేవనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు ఉండగా ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లిస్తోందని వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండి, వడ్డించే వర్కర్లకు ఇచ్చే భత్యాలు కూడా సరిపోవడం లేదంటున్నారు. ప్రస్తుతం వంద లోపు విద్యార్థులుండే పాఠశాలల్లో ఒక వంట మనిషి, ఒక హెల్పర్‌కు ఒక్కొక్కరికి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. దీన్ని రూ.5 వేలకు పెంచాలన్న డిమాండ్‌ ఉంది.

Updated Date - Nov 28 , 2024 | 03:42 AM