Share News

TS News: పిల్ల పెండ్లికి తులం బంగారం

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:08 AM

కల్యాణమస్తు, షాదీముబారక్‌ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో పెళ్లిళ్లు చేసుకునే ఆడబిడ్డలకు ఇకపై ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

TS News: పిల్ల పెండ్లికి తులం బంగారం

కళ్యాణమస్తు, షాదీముబారక్‌లో నగదుతో పాటే

బడ్జెట్‌ను రూపొందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశం

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో

నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాల్ని అన్వేషించండి

డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లో లబ్ధిదారుల పెంపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల సమీక్షలో సీఎం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): కల్యాణమస్తు, షాదీముబారక్‌ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో పెళ్లిళ్లు చేసుకునే ఆడబిడ్డలకు ఇకపై ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ కానుకగా తులం బంగారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ ఒకేచోట ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ హబ్‌గా ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేడెట్‌ హబ్‌ను నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని సంక్షేమ గురుకులాలు ఒకేచోట ఉంటే.. వాటి నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగ్గా ఉంటుందని, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వారిలో ప్రతిభాపాటవాలు, పోటీతత్వం పెరుగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ల నిర్మాణానికి సరిపడా స్థలాలను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఒకవేళ నియోజకవర్గ కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు వీలుకాకుంటే.. అదే సెగ్మెంట్లోని మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని సూచించారు.

ఇప్పటికే 20 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న స్కూల్‌ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలనూ పరిశీలించాలన్నారు. ఈ ఎడ్యుకేషన్‌ హబ్‌ల నిర్మాణానికి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎ్‌సఆర్‌) కింద కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీల సహకారం తీసుకోవాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫారాల కోసం సీఎ్‌సఆర్‌ నిధులను సమీకరించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సీఎం ఆదేశించారు. సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడా స్థలాలను గుర్తించాలన్నారు. ఒక్కో స్కూల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని కూడా అంచనా వేసి, బడ్జెట్‌ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్‌, కాస్మెటిక్‌ చార్జీలు, వంట బిల్లులు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. గ్రీన్‌ చానల్‌ విధానంలో వాటి చెల్లింపులు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు అంశాన్ని అధ్యయనం చేయాలన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అందిస్తున్న మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని కూడా మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలన్నారు. విదేశీ వర్సిటీల ర్యాంకింగ్స్‌ ఆధారంగా టాప్‌ వర్సిటీలను గుర్తించి.. ఫ్రేమ్‌వర్క్‌ తయారుచేయాలని, వాటిల్లో మన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

Updated Date - Jan 28 , 2024 | 09:04 AM