Share News

KTR : రాహుల్‌.. రాసిచ్చింది చదవడం కాదు.. రేవంత్‌ నీతో ఉంటడో.. ఉండడో చూసుకో

ABN , Publish Date - May 06 , 2024 | 05:30 AM

రాష్ట్రంలో మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తున్నామని నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ చెప్పారు. నాకైతే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు. రాహుల్‌.. రాసిచ్చింది చదువుడు కాదు.. ఎన్నికల అనంతరం రేవంత్‌ నీతో ఉంటడా..?

KTR : రాహుల్‌.. రాసిచ్చింది చదవడం కాదు.. రేవంత్‌ నీతో ఉంటడో.. ఉండడో చూసుకో

కాంగ్రెసోళ్లు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/ఉప్పల్‌/రాంనగర్‌/హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తున్నామని నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ చెప్పారు. నాకైతే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు. రాహుల్‌.. రాసిచ్చింది చదువుడు కాదు.. ఎన్నికల అనంతరం రేవంత్‌ నీతో ఉంటడా..? లేదా..? చూసుకో్‌ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. హామీలను అమలు చేయకుండా రాహుల్‌తో రేవంత్‌ పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్‌ వ్యవహారం చూశాకే.. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలోకి వెళ్తాడని చెబుతున్నానని పేర్కొన్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ రింగ్‌రోడ్డులో, సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావు గెలుపును కాంక్షిస్తూ రాంనగర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ రాముని గుడి కట్టిస్తే.. కేసీఆర్‌ యాదాద్రిని కట్టించారని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఆధునిక దేవాలయాలను నిర్మించారని చెప్పారు. ప్రాజెక్టులన్నింటికీ దేవతల పేర్లే పెట్టామని, అయినా దేవుని పేరు, మతం పేరు చెప్పి తాము ఓట్లు అడగడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేకుండా కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎ్‌సకు 10-12 ఎంపీ సీట్లు ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను మళ్లీ ఆయన శాసిస్తారన్నారు. జీఎస్టీ పేరిట రాష్ట్రాలకు వాటా దక్కకుండా రూ.30 లక్షల కోట్ల సెస్‌ వసూలు చేసిన ప్రధాని మోదీ.. అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు రూ.14 లక్షల కోట్ల రుణం మాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.

చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌కి కట్టిస్తావా?

‘‘ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలాడుతున్నావ్‌.. మహిళలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నావో చూపిస్తావా? లేదంటే.. నువ్వు చీర కట్టుకుంటావా..? రాహుల్‌కు కట్టిస్తావా..?’’ అంటూ రేవంత్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, కావాలంటే చీర కట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి తెలుసుకోవాలని రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. కాగా, పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగులయ్యకు కేటీఆర్‌ ఆర్థిక సాయం అందించారు.

Updated Date - May 06 , 2024 | 05:30 AM