చీమలదరి దేశానికే ఆదర్శం

ABN, Publish Date - Feb 13 , 2024 | 11:40 PM

టెలి కమ్యూనికేషన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవడంలో వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం, చీమలదరి గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహన్‌ అన్నారు.

కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహన్‌

మోమిన్‌పేట్‌, ఫిబ్రవరి 13 : టెలి కమ్యూనికేషన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవడంలో వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం, చీమలదరి గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి దేవ్‌సిన్హా చౌహన్‌ అన్నారు. జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిన మోమిన్‌పేట్‌ మండలంలోని చీమలదరి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో, టెలికమ్యూనికేషన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవడంలో చీమలదరి గ్రామం దేశ ంలో అన్ని గ్రామాల కంటే ఎంతో ముందున్నదని అభినందించారు. పంచాయతీ సేవలతో పాటు వివిధ ధృవపత్రాల జారీ, పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన, ఇతర పౌర సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ వినియోగించడం సంతోషంగా ఉందన్నారు. దేశఽంలోని ఇతర గ్రామాలు చీమలదరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని టెలి కమ్యూనికేషన్‌ సేవలు సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో టెలి కమ్యూనికేషన్‌ రంగం అద్భుతంగా విస్తరిస్తూ గణనీయంగా అభివృద్ధి చెందిందని, దీనికి ఉదాహరణ చీమల్‌దరి గ్రామమేనని ఆయన గుర్తు చేశారు. చీమల్‌దరి పాఠశాలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆన్‌లైన్‌ సేవల ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించడం శుభసూచకమన్నారు. డిజిటల్‌ పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా స్మార్ట్‌ బోర్డుపై బోధించడం అభినందనీయమంటూ ఆయన ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్‌ సేవలు విస్తృతంగా వినియోగించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో విశాలమైన రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు పెంచడం, ఆధార్‌ కేంద్రం ఏర్పాటు చేయడం గ్రామాభివృద్ధిని సూచిస్తుదన్నని చెప్పారు. గ్రామంలో ఇంటింటికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా వైఫై సేవలు అందించేందుకు గ్రామ మాజీ సర్పంచ్‌ నరసింహరెడ్డి చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. తన స్వంత డబ్బులు రూ.50 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌ నెట్‌ ప్రాజెక్టు సహాయంతో గ్రామ పంచాయతీలో స్మార్ట్‌ విలేజ్‌గా 108 ఇళ్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు తీసుకున్నారని గ్రామ మాజీ సర్పంచ్‌ నరసింహరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాలను టెలి కమ్యూనికేషన్‌ పరిధిలోకి తీసుకు వచ్చేలా కృషి చేయాలని, వచ్చే సంవత్సరం నుంచి అన్నీ గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించేలా కృషి చేయాలని ఆయన బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు సూచించారు. అంతకు ముందు అంగన్‌వాడీ భవనం, పాఠశాలలను సందర్శించిన కేంద్ర మంత్రి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో, పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలో ఏయే సేవలు అందిస్తున్నారనేది ఆయన స్వయంగా పరిశీలించారు. అంతకు ముందు గ్రామంలో పర్యటించిన ఆయన గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఆర్డీవో విజయకుమారి,, బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసచారి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.నర్సింహారెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నతాధికారులు, తహసీల్దార్‌ మనోహరచక్రవర్తి, ఎంఈవో గోపాల్‌, ఎంపీవో యాదగిరి, పంచాయతీ కార్యదర్శి సుగుణ, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated at - Feb 13 , 2024 | 11:40 PM